కలం/ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలో జరిగిన రెండు బస్సు ప్రమాదాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సీరియస్ అయ్యారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్ పాడు వద్ద వివేకానంద స్కూల్ బస్ కాలువలో పడింది. బస్ లో 107 మంది స్టూడెంట్లు ఉండగా.. 40 మందికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం తాగి వేగంగా బస్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్టూడెంట్లు చెబుతున్నారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నాట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. మండలంలోని భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం ఉదయం పాల్వంచ కేఎల్ఆర్ కాలేజీ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 60 మంది గాయపడ్డారు. ఇందులో కూడా డ్రైవర్ నిర్లక్ష్యం ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ రెండు ఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. రెండు ఘటనల వివరాలను కలెక్టర్ అనుదీప్ దురశెట్టితో ఫోన్ లో మాట్లాడి తెలుసుకున్నారు. పరిమితికి మించి బస్సుల్లో విద్యార్థులను తీసుకెళ్లడంపై ఫైర్ అయ్యారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ యాజమాన్యం, డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాయపడిన విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.

Read Also: పటాన్‌చెరులో రాజుకున్న ‘ఫ్లెక్సీ’ రాజకీయం: సొంత పార్టీ నేతల పనేనా?
Follow Us On: Instagram


