కలం, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు హుస్నాబాద్‌లో(Husnabad) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం హుస్నాబాద్ అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు మార్గం చూపిందని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అప్పటి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు మిత్రపక్షాల సమన్వయం కీలక పాత్ర పోషించిందని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రజల ప్రయోజనాలే ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమకారులకు అమరుల కమిటీ నివాళులు అర్పిస్తోందని పేర్కొన్న మంత్రి, త్వరలోనే ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడించారు.

