కలం, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ (Telangana) రైతుల పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగుతున్నా, కేంద్రం ధాన్యం సేకరణ లక్ష్యాలను తగ్గించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రైతులను నిరాశపరుస్తోందని విమర్శించారు.
2025–26 రబీ (యాసంగి) సీజన్‌లో ఇప్పటివరకు 67.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.12,375 కోట్లను నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. అకాల వర్షాల వల్ల తడిసిన 10,215 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందించిందని తెలిపారు. రాష్ట్రంలో 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే కేంద్రం సహకారం లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి ఆరోపించారు. యాసంగిలో తెలంగాణలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉండగా, కేంద్రం కేవలం 52 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని మాత్రమే కేటాయించిందని విమర్శించారు. పంజాబ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు తక్కువ కేటాయింపులు ఇవ్వడం వివక్షకు నిదర్శనమని అన్నారు.
మొక్కజొన్న, జొన్నల కొనుగోళ్లపై కూడా కేంద్రం సహకారం ఇవ్వడం లేదని మంత్రి ఆరోపించారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు. అలాగే ఉత్తర తెలంగాణ రైతుల భవిష్యత్తుకు కీలకమైన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కేంద్రం, బీజేపీ నేతలు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రతో చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా స్పందన లేకపోవడం విచారకరమని చెప్పారు. 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించేందుకు కేంద్రం చొరవ చూపాలని, బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

