కలం, వెబ్ డెస్క్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం(Kuwait Airport)పై జరిగిన దాడిలో ఓ భారతీయుడు మృతి చెందాడు. ఈ మేరకు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో మరో 63 మంది గాయపడినట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. తలకు గాయాలు, మెదడులో రక్తస్రావం, అవయవాలు తెగిపోవడం వంటి ఘటనలు నమోదయ్యాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.
భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి
ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబానికి, గాయపడినవారికి అవసరమైన సహాయం అందించేందుకు కువైట్ అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించింది. దాడి కారణంగా టెర్మినల్-1కు నష్టం వాటిల్లడంతోపాటు ప్రాణనష్టం సంభవించడంతో కువైట్ విమానయాన అధికారులు బుధవారం దేశంలోని విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయాన్ని కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతినిధి అబ్దుల్లా అల్-రజ్హీ ప్రకటించారు.

