ప్రజల గడప వద్దే సమస్యల పరిష్కారం: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti), కూసుమంచి (Kusumanchi) మండలంలోని పాలేరు గ్రామంలో ప్రజాదర్బార్ (Praja Darbar) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ప్రజల సమస్యలను వారి గడప వద్దనే పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారులు ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను స్వీకరించి, వేగంగా పరిష్కరించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. గతంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని అన్నారు.

ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, న్యాయబద్ధమైన సమస్యలకు మూడు నెలలలో పరిష్కారం చూపేలా కార్యాచరణ రూపొందించామని మంత్రి వెల్లడించారు. పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని క్లస్టర్లుగా విభజించి, గ్రామాల వారీగా దరఖాస్తులు స్వీకరించడం ద్వారా పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చామని వివరించారు. సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లక్షలాది మందికి గృహాలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. నిర్మాణ పురోగతిని బట్టి లబ్ధిదారుల ఖాతాలలో నిధులు జమ చేయడం వల్ల ప్రజలలో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని అన్నారు. దీంతో ప్రజాదర్బార్‌లో ఎక్కువగా ఇళ్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు.

భూముల సమస్యలపై మాట్లాడుతూ, ధరణి కారణంగా ఏర్పడిన ఇబ్బందులను భూభారతి ద్వారా పరిష్కరిస్తున్నామని, ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ నంబర్ ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. భూ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, భవిష్యత్తులో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి, చెల్లింపులను సమయానికి రైతుల ఖాతాలలో జమ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మే 4న ఖమ్మంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ మాట్లాడుతూ, ప్రజల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు తమ పూర్తి వివరాలను అందించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>