కలం, కరీంనగర్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ఆస్తుల పంచాయితీ పరిష్కరించుకున్న తర్వాత ప్రజా ప్రభుత్వం పై విమర్శలు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) అన్నారు. బుధవారం కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని ధర్మారం వ్యవసాయ మార్కెట్‌లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. నంది మేడారం, చామన్ పల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఆస్తుల పంచాయతీ పరిష్కరించుకోండి..
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిగిపోవాలని, బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని హరీష్ రావుతో పాటు కొత్తగా పార్టీలో చేరిన జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం ముందు ఆస్తుల పంచాయతీ పరిష్కరించుకున్న తర్వాత ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయాలని మంత్రి సూచించారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు దిగిపోవాలని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ కూతురు కవితకు పార్టీ పెట్టేటన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని మంత్రి అడ్లూరి డిమాండ్ చేశారు.
క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని మంత్రి తెలిపారు. మొక్కజొన్న రైతులకు మద్దతు కల్పించాలని, మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాలుకు రూ. 2,400 మద్దతు ధర చెల్లిస్తుందని మంత్రి తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించి చేతులు దులుపుకుంటుందని మంత్రి ఆరోపించారు. గత ఖరీఫ్ సీజన్‌లో రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా వెంటనే సేకరించి యాసంగి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద బోరుబావి తవ్వించడంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో అంబేద్కర్ భవనం ఏర్పాటు తోపాటు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

