కలం, నల్లగొండ: రానున్న సంవత్సర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అంగుళాన్ని సర్వే చేసి వివాదం లేని భూములకు వెంటనే యజమానులకు పట్టాలు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి పర్యటించారు.
నూతనకల్(Nuthankal), మద్దిరాల (Maddirala) మండలాలకు సంబంధించి దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న 15 గ్రామాల 1,061 మంది రైతులకు 1,044 ఎకరాలకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మంత్రి పొంగులేటి (Minister Ponguleti) మాట్లాడుతూ.. పట్టాలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. అన్ని జిల్లాల్లో తాతల నాటి భూ సమస్యలకు కూడా భూ భారతి ద్వారా పరిష్కారం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
మొదట 70 గ్రామాల్లో సర్వే..
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొదటి విడతగా 70 గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేయిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. పలుచోట్ల రెవెన్యూ, దేవాదాయ, అసైన్డ్ భూములు కబ్జాకు గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం తరఫున కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గత ప్రభుత్వం రూ.8.21 లక్షల కోట్ల అప్పును తమ ప్రభుత్వంపై మోపి వెళ్లిపోయిందన్నారు.
అయినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా అమలు చేస్తూనే ఉన్నామని మంత్రి పొంగులేటి వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టాలు ఇవ్వలేని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ముసలి కన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. గడచిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలో మహిళలకు రూ.63 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని వెల్లడించారు. రాబోయే రెండున్నరేళ్లలో కూడా అంతే మొత్తం ఇవ్వబోతున్నట్లు వివరించారు.
ఒక్క తుంగతుర్తికే రూ.100 కోట్లు..
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. భూమికి హక్కు ఉంటేనే రైతుకు ధైర్యం ఉంటుందన్నారు. ఏ రాష్ట్రంలో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.36 వేల కోట్లతో హ్యమ్ రోడ్లను నిర్మిస్తున్నామని, ఒక్క తుంగతుర్తి నియోజకవర్గానికే రూ.100 కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టులు మంజూరు చేయగా.. మరో రూ.200 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు. సూర్యాపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లు వేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రాష్ట్ర రెవెన్యూ, సీసీఎల్ఏ సెక్రటరీ లోకేష్ కుమార్, ల్యాండ్ సర్వీస్ సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ హరి సింగ్, రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.
Also Read : పాలమూరుకు ‘బ్రహ్మాస్త్రం’.. రూ 500 కోట్లతో 416 ఎకరాల్లో ఏర్పాటు
Follow Us On: X(Twitter)

