పాలమూరుకు ‘బ్రహ్మాస్త్రం’.. రూ 500 కోట్లతో 416 ఎకరాల్లో ఏర్పాటు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు కీర్తి కిరీటంలో ‘బ్రహ్మోస్’ (BrahMos Missile) కలికితురాయిగా మారనుంది. వలసల గడ్డ నుంచి క్షిపణుల అడ్డాగా పాలమూరు రూపాంతరం చెందుతుంది. ఒకప్పుడు వలసల జిల్లాగా కన్నీటి కథలను వినిపించిన పాలమూరు నేడు దేశ రక్షణ రంగానికి వెన్నుముకగా నిలిచే ‘బ్రహ్మోస్’ క్షిపణుల తయారీ కేంద్రానికి చిరునామాగా మారుతోంది. వలస కూలీలు వెళ్ళిన దారుల్లోనే ఇప్పుడుఅత్యాధునిక సాంకేతికత అడుగులు వేస్తోంది.

ఢిల్లీ టూ దేవరకద్ర అంటూ వేగవంతమైన కదలికలు.. ఇటీవల జూన్ నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఢిల్లీలో జరిపిన చర్చలు ఈ ప్రాజెక్టుకు కొత్త ఊపిరినిచ్చాయి. మేకిన్ ఇండియా ,ఆత్మనిర్బర భారత్ లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లో 200 ఎకరాల విస్తీర్ణంలో రూ .380 కోట్లతో ఒక బ్రహ్మోస్ యూనిట్ ను ప్రారంభించారు.

దక్షిణ భారతదేశంలో మరో భారీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి బ్రహ్మోస్ ఏరోస్పేస్ బృందం గత కొంతకాలంగా వివిధ ప్రాంతాలను పరిశీలిస్తూ వస్తోంది. నిపుణుల బృందం మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర సమీపంలో గల ప్రాంతాన్ని పరిశీలించి సానుకూలత వ్యక్తం చేసింది.ఈ ప్రాజెక్టు కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, పాలమూరు ముఖచిత్రం మార్చే ఒక మెగా వెంచర్గా ఉండనుందని పరిశీలకులు భావిస్తున్నారు.

రూ 500 కోట్ల ఖర్చుతో..

సుమారు రూ. 500 కోట్లు అంచనాతో ఏర్పాటుచేసి ఈ క్షిపణి తయారీ కేంద్రంలో ప్రత్యక్షంగా 1,500 నుండి 2,000 మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ఇక్కడే తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం ఈ యూనిట్‌ కేంద్రబిందువుగా మారడానికి దీని వెనుక బలమైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి.

దేవరకద్రలోని చౌదర్‌పల్లి, బస్వాయ్‌పల్లి, అజిలాపురం గ్రామాల పరిధిలో దాదాపు 416 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించడం ఈ బ్రహ్మోస్ క్షిపని తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్లస్ పాయింట్ గా మారింది. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న గుట్టలు పరిశ్రమకు ఒక సహజసిద్ధమైన రక్షణ గోడగా ఉపయోగపడతాయనీ డిఆర్డిఏ అధికారులు భావించారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారికి కేవలం 6 కి.మీ దూరంలో ఉండటం, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 100 కి.మీ సామీప్యతలో ఉండటం తో బ్రహ్మోస్ జనరల్ డైరెక్టర్ జై తీర్థ జోషి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిఆర్డిఏ డైరెక్టర్ జిఏ శ్రీనివాసమూర్తి దీనికి పచ్చ జెండా ఊపారు.

ఈ యూనిట్ ఏర్పాటుతో పాలమూరు స్వరూపం మారనుంది.డిఫెన్స్ హబ్ మహబూబ్నగర్ రూపాంతరం చెందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ లేబొరేటరీస్ కు దగ్గరగా ఉండటంతో, భవిష్యత్తులో మహబూబ్‌నగర్ ఒక ‘డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్’గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.క్షిపణి తయారీకి అవసరమైన చిన్న విడిభాగాలు, పరికరాలు తయారు చేసే అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ ప్రాంతంలో వెలవనున్నాయి . దీంతో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయే అవకాశాలున్నాయి.

పూర్తికావచ్చిన సర్వే పనులు

బ్రహ్మోస్ క్షిపణి (BrahMos Missile) తయారీ యూనిట్ ఏర్పాటుకు కావలసిన ప్రభుత్వ భూమిని ఇటీవల సర్వే అధికారులు పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి రిపోర్టు అందజేసినట్టు తెలిసింది. ఇందులో ప్రభుత్వ భూమి 416 ఎకరాలుగా గుర్తించగా, యూనిట్ ఏర్పాటు కోసం మరికొంత ప్రైవేట్ భూములు కూడా సేకరించినందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు పట్టా భూముల్లో సైతం సర్వే పనులు నిర్వహించి ఇటీవల అధికారులకు రిపోర్ట్ అందజేశారు. దీంతో క్షిపణి తయారీ యూనిట్కు మార్గం సుగమమైందని ప్రజలు భావిస్తున్నారు.

Also Read : ఆస్ట్రేలియాను కాదనుకుని భారత ఫుట్‌బాల్‌లోకి విలియమ్స్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>