కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గ్రామాల స్థానిక అవసరాలను గుర్తించి, అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ సమగ్ర అభివృద్ధికి పకడ్బందీగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు (వీజీపీ) రూపొందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Madhusudan Naik) అధికారులను ఆదేశించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విజీపిపిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలు, మండల స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, టెక్నికల్ సిబ్బందికి అవగాహన కల్పించారు.
సూచనలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి..
గ్రామ పంచాయతీల అభివృద్ధి, పరిపాలన, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై రాష్ట్రస్థాయిలో నిర్వహించిన శిక్షణలో ఇచ్చిన సూచనలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్య రంగాలతో పాటు తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాల వారీగా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల అవసరాలను గుర్తించాలని, ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ప్రణాళికల అమలులో నాణ్యత, పారదర్శకత, సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి మండలంలో గ్రామ పంచాయతీల వారీగా ప్లానింగ్ షెడ్యూల్ సిద్ధం చేసి, మండల స్థాయి ప్లానింగ్ బృందాల ఏర్పాటు వివరాలను సమర్పించాలని ఎంపీడీవోలను ఆదేశించారు.
ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టాలి..
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ అన్నారు. ఫార్మ్ పాండ్స్, ట్రెంచ్‌లు, సోక్‌పిట్స్, గ్రే వాటర్ మేనేజ్‌మెంట్, వాటర్ హార్వెస్టింగ్ వంటి పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. జిల్లాలో కురిసే ప్రతి చుక్క వర్షపు నీటిని సాధ్యమైనంత వరకు జిల్లాలోనే నిల్వ చేసి, భూగర్భ జలాలను రీచార్జ్ చేసేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు.
రైతులు ఫార్మ్ పాండ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చేలా అధికారులు అవగాహన కల్పించడంతో పాటు వారిని ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు కేవలం ఆదేశాలు ఇవ్వడం కాకుండా ఫార్మ్ పాండ్స్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని అన్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి, భవిష్యత్తులో బోర్లలో నీటి లభ్యత మెరుగుపడి పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని రైతులకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు.
క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేయాలి..
ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు తమ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, మల్టీపర్పస్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ సిబ్బందిని సమన్వయం చేసుకుని పనిచేయించాలని మధుసూదన్ నాయక్ అన్నారు. అవసరమైన చోట గ్రామసభలు నిర్వహించి, సర్పంచులు, ప్రజలను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. మండల స్థాయిలో అధికారుల మధ్య సమన్వయం మరింత పెరగాలని, ప్రతి గ్రామంలో జరుగుతున్న పనులు, వాటి పురోగతి, ఎదురవుతున్న సమస్యలను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.
ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి..
ఉపాధి హామీ పనుల్లో లేబర్ మొబిలైజేషన్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అదనపు కలెక్టర్ (Madhusudan Naik) సూచించారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నప్పటికీ, అందుకు అనుగుణంగా పనిదినాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మండలంలో లేబర్ తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను విశ్లేషించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలు, కూలి చెల్లింపులు, ప్రభుత్వ పనుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.
మహబూబ్‌నగర్ జిల్లాను అన్ని అభివృద్ధి సూచీల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. మండల స్థాయిలో పనిచేసే ఎంపీడీవోలు ప్రజలకు అత్యంత చేరువగా ఉండే కీలక అధికారులు అని పేర్కొంటూ, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా ముందుండి పనిచేయాలని సూచించారు. అధికారుల సమిష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలపాలని, ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలని మధుసూదన్ నాయక్ కోరారు.
అంతకు ముందు, డీఆర్డీఓ నరసింహులు, వీజీపీపీ ప్రణాళికను అన్ని శాఖల కన్వర్జెన్స్ తో రూపొందించుకోవాలని అన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి వేణుగోపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, పశుసంవర్ధక శాఖ జేడీ శివానంద స్వామి, మత్స్యశాఖ డీడీ రాధ రోహిణి మాట్లాడుతూ.. వారి వారి శాఖల ద్వారా అమలుచేస్తున్న పథకాలు, చేపడుతున్న పనులు, వాటి నిర్వహణ, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆయా శాఖల ద్వారా చేస్తున్న, చేయబోయే పనులను కూడా గ్రామ పంచాయతీ ప్రణాళికలో పొందపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ, ఇంచార్జ్ డీపీఓ వెంకట రెడ్డి, అదనపు డీఆర్డీఓ వామన రావు, అన్ని మండలాలఎంపీడీవోలు, ఏపీఓలు, ఈసీలు, టీఎలు తదితర అధికారులు పాల్గొన్నారు.
Also Read : వరల్డ్ కప్ గెలిచాడు.. టీమ్‌లోనే చోటు పోయింది!
Follow Us On: Sharechat

