కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని క్యూర్ పరిధిలో పేదల కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలోని మల్కం చెరువు సమీపంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) సోమవారం శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన ప్రసంగిస్తూ పట్టణ పేదలకు వారు నివసిస్తున్న ప్రాంతాలకు సాధ్యమైనంత దగ్గరలోనే సొంతింటిని అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పేదలను ఖరీదైన ప్రాంతాల నుంచి తరలించకుండా ఖరీదైన ప్రాంతాల్లోనే ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నట్లు పొంగులేటి చెప్పారు.
హైదరాబాద్ లో భూముల విలువ భారీగా ఉన్న ప్రాంతాల్లోనే పేదలకు ఇండ్లు నిర్మిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీని ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం భద్రత, భరోసా కల్పిస్తోందని తెలిపారు. ఇందిరమ్మ టవర్స్ లో లబ్ధిదారులకు అన్ డివైడెడ్ షేర్ తో పాటు అపార్ట్ మెంట్ ప పూర్తి హక్కులు కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇండ్ల రిజిస్ట్రేషన్ కు సేల్ డీడ్ కు చార్జీలు లేకుండా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి (Minister Ponguleti) తెలిపారు. అలాగే, ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యానికి, పైరవీలకు తావులేదని పొంగులేటి స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. వచ్చే బోనాల నాటికి ఇక్కడి నుంచే బోనాలు ఎత్తించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇండ్లు రాని వాళ్లు నిరాశ చెందాల్సిన అవసరం లేదని ఐదు విడతలుగా ఇండ్ల నిర్మాణం చేపడతామని మంత్రి హామీనిచ్చారు. ఇప్పటికే గ్రామిణ ప్రాంతాల్లో తొలి దశలో 4.50 లక్షలు, రెండో దశలో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇందిరమ్మ టవర్స్ కార్యక్రమం చేపట్టినట్లు పొంగులేటి వివరించారు.

