కలం, ఖమ్మం బ్యూరో: పాలేరు (Paleru) నియోజకవర్గంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.205 కోట్లతో భారీ మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. గత 34 నెలల్లో కేటాయించిన ఈ నిధులతో సబ్‌స్టేషన్ల నిర్మాణం, హైటెన్షన్ వైర్ల మార్పిడి, కొత్త విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు.
గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తరుణి హాట్‌లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్‌లతో కలిసి మంత్రి డివిజన్ ఈఆర్‌ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకాన్ని తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని, ప్రస్తుతం గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టులను పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించామని పేర్కొన్నారు.
విద్యుత్ రంగంలో పలు సంస్కరణలు చేపడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ పవర్‌కు పెద్దపీట వేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణను విద్యుత్ రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసా చారి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యుగంధర్ రావు, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్‌డీఓ ఎన్. శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

