కలం, వెబ్ డెస్క్: తెలంగాణ భూపరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) ప్రకటించారు. గత ప్రభుత్వ ‘ధరణి’ సమస్యలకు చెక్ పెడుతూ సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ (Bhu Bharati Portal)ను డిజైన్ చేశామన్నారు. ఏప్రిల్ 2 నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నట్లు పొంగులేటి వెల్లడించారు. గురువారం సచివాలయంలోని రెవెన్యూ, సర్వే, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, ఎన్ఐసి అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకనుగుణంగా రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ భూభారతి పోర్టల్‌ను అభివృద్ధి చేశామన్నారు. ప్రతి భూలావాదేవీ వివరాలు కనిపించేలా పారదర్శకంగా ఈ పోర్టల్‌ను రూపొందించినట్లు వెల్లడించారు.
ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను నారాయణపేట జిల్లా కొస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలాల్లో అమలుచేస్తామని తెలిపారు. ఈ పైలట్ మండలాల్లో మెరిట్- డీమెరిట్లను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అవసరమైన మార్పులు చేర్పులు చేశామన్నారు. రెండవ దశలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, అలాగే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి భూభారతి పోర్టల్‌ను తీసుకొస్తున్నామన్నారు. దీని ద్వారా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో భూవివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు.
ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే నెంబర్‌కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్‌ను కూడా ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నక్షాలేని ఐదు గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూధార్ నెంబర్‌ను కేటాయించామన్నారు. ధరణి పోర్టల్‌లో 36 మాడ్యూల్స్ ఉండగా భూభారతి పోర్టల్‌లో ఒకే ఛాప్టర్ కింద తీసుకువచ్చామన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డీఎస్. లోకేశ్ కుమార్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హన్మంతు, ఎన్ఐసి అధికారులు పాల్గొన్నారు.

