కలం, కరీంనగర్ బ్యూరో: హుజూరాబాద్ నియోజకవర్గంలోని పెండింగ్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే(Huzurabad MLA) పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) మంత్రులను కోరారు. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కాల్వల ప్రాజెక్టుకు రూ.70 కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. పేలుళ్ల కారణంగా దెబ్బతిన్న తనుగుల చెక్‌డ్యామ్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్న నేపథ్యంలో కన్నెపల్లి పంపులను వెంటనే ఆన్ చేసి హుజూరాబాద్ ప్రజలకు తాగు, సాగునీరు అందించాలని కోరారు.
కరీంనగర్ కొత్త జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేయాలని కోరారు. కమలాపూర్ పెద్దమ్మతల్లి ఆలయ అభివృద్ధికి రూ.25 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వీణవంక మండలంలోని డబుల్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు గతంలో మంజూరైన రూ.15 కోట్ల చొప్పున నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించాలని కోరారు. జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాల్లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల పనులు సుమారు 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనుల కోసం రెండు పట్టణాలకు రూ.2 కోట్ల నిధులు అవసరమని తెలిపారు. జమ్మికుంట పట్టణంలో 100 శాతం పన్నులు వసూలు చేసినందుకు ఇన్సెంటివ్‌గా రావాల్సిన రూ.3 కోట్లను విడుదల చేయాలని కోరారు.
నియోజకవర్గంలో ఇసుక రవాణా కారణంగా రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇసుక లభ్యత ఉన్నప్పటికీ రూ.1,500కు దొరకాల్సిన ఇసుక రూ.7,500 వరకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. కమలాపూర్ బస్టాండ్‌కు ఆసుపత్రి నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరారు. దళిత బంధు రెండో విడత నిధులను విడుదల చేయాలని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. కరీంనగర్ జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా పాడి కౌశిక్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దొంగతనాలు, హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే మంత్రులకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై మంత్రులు సానుకూలంగా స్పందించి, సంబంధిత పనులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

