కరీంనగర్‌లో కోలాహలంగా బోనాల జాతర

కలం, కరీంనగర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, స్థానిక ప్రజల జీవన విధానానికి ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల పండుగ కరీంనగర్‌లో (Karimnagar) అత్యంత కోలాహలంగా జరిగింది. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని నగరంలోని భగత్‌నగర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం, రాంచంద్రపూర్ కాలనీ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ తల్లి బోనాల జాతర (Pochamma Thalli Bonalu Jatara) మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు స్వయంగా నెత్తిన బోనం ఎత్తుకున్నారు.

అనంతరం పెద్ద సంఖ్యలో మహిళలు పసుపు, కుంకుమ, వేపమండలతో అందంగా అలంకరించిన బోనాలను తలపై పెట్టుకుని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా భక్తుల సందడితో పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ నేలకే తలమానికంగా నిలిచే బోనాల పండుగ ప్రజల ఐకమత్యానికి, ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐకమత్యంతో, సుఖసంతోషాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

గ్రామ దేవత పోచమ్మ తల్లి చల్లని చూపు కరీంనగర్ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆషాఢమాసంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సౌగాని కొమురయ్య, నలువాల రవీందర్, చొప్పరి జయశ్రీ–వేణు, పొన్నం లక్ష్మీ–మొండయ్య గౌడ్, భగత్‌నగర్, రాంచంద్రపూర్ కాలనీ మున్నూరు కాపు సంఘం సభ్యులు, కుల పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>