కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ పట్టణాభివృద్ధికి కోసం సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన ప్రజలు భాగస్వామ్యులుగా ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) పిలుపునిచ్చారు. నగరంలోని వాసవి గార్డన్‌లో ఆదివారం నిర్వహించిన ఆర్యవైశ్య మహాసభ, పాలమూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా యెన్నం మాట్లాడుతూ, మహబూబ్ నగర్ పట్టణాభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. పట్టణాభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పెద్దలు తమ పాత పాఠశాలల అభివృద్ధికి ముందుకు వచ్చి, పాఠశాల విద్యా కమిటీలలో సభ్యులుగా సేవలు అందించాలని సూచించారు.
సమాజానికి విపత్తులు వచ్చినప్పుడు వైద్యులు ముందుండి సేవలు అందిస్తారని, వైశ్యులు సంపద సృష్టించి ఆర్థికాభివృద్ధికి తోడ్పడతారని తెలిపారు. మహిళలు కూడా సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రిని ఒప్పించి మహబూబ్ నగర్ కు ఐఐఐటీ కళాశాలను తీసుకువచ్చినట్లు చెప్పారు.
భవిష్యత్ తరాల కోసం ఆధునిక సదుపాయాలతో కూడిన నగరాన్ని నిర్మించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొంటూ, పట్టణ పురోభివృద్ధికి ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గుద్దేటి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి కలకొండ రాఘవేందర్, కోశాధికారి వలకొండ చంద్రశేఖర్, హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంద్ర, వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

