epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మాట ఇస్తే వెనక్కి తగ్గేది లేదు : మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: గత ప్రభుత్వంలాగా అబద్ధపు హామీలతో ప్రజలను వంచించే రకం ఈ ప్రజా ప్రభుత్వానిది కాదని, మాట ఇస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుతిరగమని మంత్రి పొంగులేటి (Ponguleti) స్పష్టం చేశారు. ఇప్పటికే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 560 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. ఏప్రిల్‌లో రెండో విడత ఇస్తాం. మొత్తం ఇంకా మూడు విడతలుగా అర్హులైన ప్రతి పేదవాడికీ పక్కా ఇల్లు కట్టించి తీరుతాం. ఇది మీ శీనన్న మాట అని భరోసా ఇచ్చారు. ఏదులాపురం అభివృద్ధికి గడిచిన రెండేళ్లలోనే సుమారు రూ.70 కోట్లు ఖర్చు చేశామని మిగిలిన సమస్యలను కూడా మీ ఇంటి పెద్ద కొడుకుగా నేనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

గడిచిన పదేళ్లలో పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం గత ప్రభుత్వానికి లేదు. ఆత్మగౌరవంతో పేదవాడు తలదాచుకునే నీడ ఇవ్వకుండా పదేళ్లూ బొమ్మలు చూపి కాలక్షేపం చేశారు. కానీ మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదే రూ. 22,500 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టిందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti) అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో ఆదివారం పర్యటించి సుమారు రూ. 1.07 కోట్ల వ్యయంతో పలు అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి గత ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేశారు.

సంక్షేమంలో సరికొత్త అధ్యాయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా చూస్తోందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో హాస్టల్ విద్యార్థులకు చాలీచాలని అన్నం పెడితే, మన ప్రభుత్వం మెస్ ఛార్జీలు 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలు 200 శాతం పెంచిందని గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ ద్వారా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు, పాత కార్డుల్లో కొత్త పేర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేశామని వివరించారు.

అభివృద్ధికి చిరునామా ఏదులాపురం

టెంపుల్ సిటీలో రూ.35 లక్షలు, చిన్నతండాలో రూ.22 లక్షలు, సూర్యనగర్‌లో రూ.25 లక్షలు, 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో రూ.25 లక్షలతో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం చుట్టామన్నారు. కాలనీల్లో పర్యటిస్తున్న సమయంలో మహిళలు తనను ఆపి సమస్యలు వివరించారని వారి కోరిక మేరకు మిగిలిపోయిన ప్రతి రోడ్డును, డ్రైన్‌ను పూర్తి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. హైటెన్షన్ లైన్ల తొలగింపు వంటి సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>