కలం, ఖమ్మం బ్యూరో : గత ప్రభుత్వ ధరణి లోపాల వల్ల రాష్ట్రంలో నిలిచిపోయిన సాదాబైనామా(Sadabainama) భూ సమస్యలకు తమ ప్రజా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) స్పష్టం చేశారు. ఖమ్మంలోని ఎస్.ఆర్. కన్వెన్షన్ హాల్‌లో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ వాటిని ధరణి చట్టంలో పొందుపరచకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ‘భూ భారతి’ చట్టంలో సాదాబైనామాను చేర్చి, హైకోర్టులో ఉన్న కేసును పరిష్కరించి రైతులకు ఊరట కల్పించామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తులలో ఇప్పటికే 5.5 లక్షలకు నోటీసులు జారీ చేసినట్లు, మిగిలిన వాటికి మరో 15 రోజుల్లో నోటీసులు అందజేస్తామని మంత్రి చెప్పారు. 30 రోజుల గడువు ముగిసిన వెంటనే అర్హులైన వారికి పూర్తి పట్టాదారు హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాలో మొదటి దశలో 70 గ్రామాలలో సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని, పట్టాలు లేని రైతుల సమస్యలను ప్రత్యేక డ్రైవ్ ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వ భూసేకరణ కారణంగా కొన్ని సర్వే నంబర్లపై ఉన్న నిషేధాలను త్వరలోనే తొలగిస్తామని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తైన సందర్భంగా చేపట్టిన “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం జూన్ 12తో ముగుస్తుందని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌ల ద్వారా వేలాది దరఖాస్తులు స్వీకరించినట్లు, అందులో భూ సమస్యలు, సాదాబైనామా దరఖాస్తులు అధికంగా ఉన్నాయని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులలో అర్హులను ఎంపిక చేసి రెండవ విడతలో 2 వేల ఇండ్లను మంజూరు చేస్తామని, ఆసరా పెన్షన్ల దరఖాస్తులను కూడా త్వరలో పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నానని, ప్రభుత్వంపై ప్రజలలో విశ్వాసం పెరిగిందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా పూర్తి పారదర్శకతతో చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

