కలం, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala) పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. జిల్లా పరిధిలోని మట్టపర్రు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని రోడ్డు సమస్యపై స్థానిక వైసీపీ నాయకులు సభా వేదికపైకి వెళ్లి మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రితో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
మట్టపర్రు రహదారి దయనీయస్థితిలో ఉందని, వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని వైసీపీ నేతలు మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala) ఇప్పటికే రోడ్డు నిర్మాణానికి రూ.1.30 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, 2029లోపు రోడ్డు పూర్తి కాకపోతే తన సొంత నిధులతోనైనా నిర్మిస్తానని హామీ ఇచ్చి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.
మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని కొందరు స్థానిక వైసీపీ నాయకులు వేదికపైనే వాగ్వాదానికి దిగారు. దీంతో మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న మీ వైసీపీ నాయకులు గ్రామ అభివృద్ధికి ఏమి చేశారంటూ ప్రశ్నించారు. పదవులు అనుభవించడమే తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టలేదని మండిపడ్డారు.
ఈ ఘటనతో సభా ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పోలీసులు, పార్టీ నాయకులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: చంద్రబాబు జనాభా పాలసీపై రేణుకా చౌదరి సెటైర్లు
Follow Us On: Instagram

