కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ముంబైలో హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (HDFC AMC) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో నవనీత్ మునోత్‌ను(Navneet Munot) కలిశారు. ₹7 లక్షల కోట్లకు పైగా ఆస్తులను నిర్వహిస్తున్న దేశంలోని ప్రముఖ ఆస్తి నిర్వహణ సంస్థలలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కార్యకలాపాలు, పెట్టుబడి అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించారు. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న విధాన సంస్కరణలు, పెట్టుబడులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు దేశ ఆర్థికాభివృద్ధిపై చూపుతున్న ప్రభావాన్ని ఇద్దరూ సమీక్షించారు.
ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి అవసరమైన చర్యలు, పెట్టుబడిదారులకు మరింత అనుకూల వాతావరణం కల్పించే అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి వేగం చేకూర్చడం, యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను లోకేశ్ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వేగవంతమైన అనుమతుల వ్యవస్థపై ఆయన వివరించారు. ఈ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై ప్రముఖ ఆర్థిక సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం మరింత సన్నిహితంగా పనిచేయాలనే సంకల్పాన్ని మరోసారి వెల్లడించింది.

