Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ ఏర్పడి పుష్కరం.. పాలమూరుకు ప్రయోజనమెంత?

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో:  నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమం విజయం సాధించి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటై పుష్కర కాలం పూర్తవుతోంది. అయినా ఇప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్న టాక్ వినిపిస్తోంది. ఎందరో తెలంగాణ బిడ్డల బలిదానాలతో ఏర్పడిన  రాష్ట్రంలో అమరుల త్యాగాలకు సైతం గుర్తింపునివ్వలేని స్థితిలో ఉందన్న విమర్శలు వస్తున్నాయి.  2001 నుంచి సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం వంటా – వార్పుల‌తో  తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. ఎందరో యువకులు అమరులయ్యారు. ఉద్యమ తీవ్రతను గమనించిన అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు సిద్ధమంటూ ప్రకటించారు. దీనికి అనుగుణంగానే 2014 ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమం పతాకస్థాయికి చేరుకున్నది.

అనుకున్న లక్ష్యాలు సాధించుకున్నామా?

తెలంగాణ ఏర్పాటై 12 ఏండ్లు గడిచిన అనుకున్న లక్ష్యాలను సాధించడంలో వెనుకబడే ఉందని మేధావులు అంటున్నారు. ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రోజున గన్ ఫౌండ్రీ లోని అమరులస్తూపం, హుస్సేన్ సాగర్ తీరంలోని అమరలదీపం వద్ద నివాళులర్పించడమే తప్ప అమరుల కుటుంబాలకు చేసిందేమీ లేదంటూ తెలంగాణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యాయం జరిగిందా?

పదేళ్లు అధికారంలో ఉన్న ఉద్యమ నాయకుడు కేసీఆర్, రెండున్నర ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి  పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగాల నియామకాల విషయంలో కూడా కేసీఆర్ ప్రసంగాలకు ఆకర్షితులైన ఎంతమంది యువత ఆయన బాటలో నడిచారు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అయినా కేసీఆర్ హయంలో ఆశించిన స్థాయిలో నోటిఫికేషన్లు రాలేదన్న విమర్శలు ఉన్నాయి. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి మోసం చేశారని నిరుద్యోగులు అంటున్నారు.

యువకులకు అవకాశం ఇవ్వరా?

ఉద్యోగ విరమణ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు మూడేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా తప్పుపట్టారు. యువకులకు అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండించారు. టీఎస్పీఎస్ ద్వారా పరీక్షలు నిర్వహించిన కోర్టులు కేసుల మూలంగా అర్ధాంతరంగా ఆగిపోయాయి.

కేసీఆర్ విధానాలపై విమర్శలు

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కకపోవడం పదవీ విరమణ బెనిఫిట్స్ అందించాల్సి వస్తుందని పదవి విరమణ వయస్సును పెంచడంపై విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ సైతం నిరుద్యోగ యువకులకు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు కల్పించడంలో శ్రద్ధ కనబరచడం లేదని విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో 44 ఏళ్లు వరకు వయసు సడదింపునిచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని కాస్త 46 ఏళ్లకు వయసు సడలింపు నిచ్చింది .అంటే ప్రభుత్వాలు ఉద్యోగులను కల్పించే విషయంలో నిరుద్యోగులతో ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

పాలమూరు జిల్లా గోస తీరిందా?

పాలమూరు జిల్లాలో జీవనదులు పాడుతున్న జీవన్మరణ సమస్యగా ఉంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని బీడువారిన పొలాల్లో పచ్చని మాగానం గా మార్చాలని ప్రభుత్వం భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంకల్పించింది. పాలమూరు జిల్లాలో కృష్ణా నదిపై నిర్మిస్తున్న భారీ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తికాక పోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యమే అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. ఇవే కాకుండా బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు సైతం పూర్తి కావడానికి ఏళ్లు గడిచిపోతున్నాయి. ఇటీవలే పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల స్థితిగతులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

పాలమూరు, రంగారెడ్డి పూర్తయ్యేనా?

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వచ్చేఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నిధులు సైతం సమకూర్చారు. ఇవే కాకుండా పాలమూరు జిల్లాలో దేవరకద్ర నియోజక వర్గంలో నూతనంగా గత రెండు రోజుల క్రితమే హాజీలాపూర్ ఎత్తిపోతల పథకానికి సైతం రాష్ట్ర నీటిపారుదల శాస్త్ర మంత్రి ఉత్తంకుమార్ శంకుస్థాపన చేశారు. సుమారు రెండువేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.32 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు.

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే..

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే పాలమూరు జిల్లా ప్రజల్లో ప్రభుత్వాలపై నమ్మకం ఏర్పడుతుందని విషయాన్ని పాలకులు మరవొద్దని విశ్లేషకులు సూచిస్తున్నారు. పుష్కరకాలంగా తెలంగాణను పరిపాలిస్తున్న ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజల అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>