కలం, నల్లగొండ: నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయం (ఇందిరా భవన్) బుధవారం ప్రజల వినతులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి (Minister Komatireddy) పలు సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు అందించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి శ్రద్ధగా ఆలకించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
అలాగే పలువురు బాధితులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డితోపాటు నల్లగొండ, కనగల్ మాజీ జడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్లు, సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు కోమటిరెడ్డిని ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లాలోని పలు అంశాలపై వారు కొద్దిసేపు చర్చించారు.

