కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తగ్గడంతో నదిలో నీటిమట్టం క్రమంగా నిలకడ స్థాయికి చేరుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 46.70 అడుగులకు చేరడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా జారీ చేసిన రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.
భద్రాచలం వద్ద 10.83 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తోంది. వరద ప్రవాహం తగ్గుతున్నా, నీటి మట్టం ఇంకా ప్రమాదకర స్థాయికి సమీపంలోనే ఉందనే విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలు నిర్లక్ష్యంగా ఉండవద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు అధికారుల సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

