కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, కొత్తగూడెం నియోజక వర్గంలో ఉమ్మడి కుటుంబాల పెండింగ్ ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను, నిర్మాణం పూర్తిచేసుకున్న లబ్దిదారుల పెండింగ్ బిల్లులను తక్షణమే క్లియర్ చేసి పేదలకు న్యాయం చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబాలలో నివసిస్తూ, సొంత ఇల్లు లేని లబ్ధిదారుల పేమెంట్లను సాంకేతిక కారణాలు చూపుతూ నిలిపివేయడం సరికాదన్నారు. గతంలో ఇల్లు ఉండి ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరిన వారిని కూడా ఆదుకోవాలని, 600 చదరపు అడుగుల నిబంధనతో సమ్మతి పత్రాల పేరిట బిల్లులు ఆపవద్దని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే జీవనోపాధి కోసం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయనే కారణంతో దరఖాస్తులను తిరస్కరించడం తగదని, క్షేత్రస్థాయి పరిశీలన నివేదికలు స్పష్టంగా ఉండాలని సూచించారు.
మున్సిపాలిటీ పరిధిలో బేస్, రూఫ్, స్లాబ్ లెవల్ వరకు ఇళ్లు నిర్మించుకుని బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి వెంటనే నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇల్లు మంజూరై ఇప్పటివరకు పనులు ప్రారంభించని వారి నుంచి నాట్ విల్లింగ్ లెటర్లు తీసుకోవాలని, మొదటి విడతలో మిగిలిపోయిన 199 మంది పేర్లను త్వరగా మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. వీటితో పాటు రెండో విడతకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల వివరాల సేకరణ, మంజూరు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు, మేయర్ మూడ్ గణేష్, బాధిత లబ్ధిదారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

