కలం, నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం 11, 6, 7, 8, 9, 10, 25 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.2,200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు తన కుమారుడు ప్రతిక్ రెడ్డి జ్ఞాపకార్థం ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి నల్లగొండలో విద్య, వైద్య సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.
తనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన ఇక్కడి ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను సూపర్ స్మార్ట్ సిటీగా చేయడమే తన ధ్యేయమన్నారు. ఈ ఎన్నికలలో ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే పేద ప్రజలకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 8వ వార్డును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామినిచ్చారు. 11వ డివిజన్ లోని మామిళ్ళగూడెంలో 3 నెలల్లోనే సీసీ రోడ్డును పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు.
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో (Nalgonda Corporation) ప్లాట్ ఉన్న పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అన్ని డివిజన్లో మిగిలి ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని పేర్కొన్నారు. పేద ప్రజలకు ఏ సమస్య ఉన్న కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) కోరారు.
Read Also: మానస సరోవరం యాత్రకు మూడో మార్గం : కేంద్రం
Follow Us On: Instagram


