కలం, యాదగిరిగుట్ట: భువనగిరి–చిట్యాల రహదారి విస్తరణ కోసం ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని, ప్రజా ప్రభుత్వం ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తెలిపారు. భువనగిరి – చిట్యాల రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఆదివారం రామన్నపేటలో మంత్రి శంకుస్థాపన చేశారు. స్టేజ్–1, ప్యాకేజ్–2/7 కింద రూ.339.59 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మొత్తం 109.3 కిలోమీటర్ల పొడవైన రహదారుల అభివృద్ధి పనులకు మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నాలుగు లేన్ల రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, రహదారి భద్రత మెరుగుపడుతుందన్నారు. రవాణా సౌకర్యాల విస్తరణతో ప్రాంతీయ వాణిజ్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, తదితరులు పాల్గొన్నారు.

