భర్తలు లేకుండానే భార్యలు సోలో ట్రిప్స్.. అసలు విషయమిదే!

కలం, వెబ్ డెస్క్: ‘పెళ్లయిన తర్వాత ఒంటరిగా ప్రయాణం (Solo Trips) ఎందుకు? భర్త ఎందుకు రావడం లేదు?’ అనే ప్రశ్నలు 30 ఏళ్ల సామ్యా గుప్తా సోలో ట్రిప్స్ ప్లాన్ చేసిన ప్రతిసారీ ఎదుర్కొనే ప్రశ్నలివి. వివాహం తర్వాత కూడా తమకంటూ వ్యక్తిగత జీవితం, స్నేహితులు, భిన్నమైన అభిరుచులు ఉంటాయని చెప్తుందామె. ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవించుకుంటూ తాము సంతోషంగానే ఉన్నామని చెబుతున్నప్పటికీ, సమాజం మాత్రం అనుమానంగానే చూస్తుంది. ప్రస్తుతం చాలా మంది వివాహం తర్వాత కూడా సంతోషాల కోసం సోలో ట్రిప్స్, స్నేహితులతో విహారయాత్రలు, నచ్చిన హాబీ కోసం క్లాసులకు వెళ్తున్నారు.

ఇది వారి బంధంలో గొడవల వల్లనో లేదా ఒంటరితనం వల్లనో కాదు. తమ భాగస్వామిని గౌరవిస్తూనే తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికేనని స్పష్టం చేస్తున్నారు. మనం చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు పెళ్లిళ్లు, షాపింగ్, విహారయాత్రలు ఇలా ప్రతిదానికీ కలిసే వెళ్లడం చూస్తూ పెరిగాం. భారతదేశంలో పెళ్లికి రెండు శరీరాలు, ఒకే ఆత్మ అనే భావన ఉంది. పెళ్లయినవారు విడిగా ఉండటాన్ని దూరం పెరుగుతోందనే కోణంలో చూస్తున్నారని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొన్నారు. ఎవరైనా సోలో ట్రిప్‌కు వెళ్తుంటే ‘ఏదో గొడవ జరిగింది’ అనే వాతావరణం నేటికీ ఉంది. సామ్యాగుప్తా లాంటి వారు పెళ్లికి ముందు ప్రయాణాలు (Solo Trips) చేస్తే ప్రశంసించే సమాజం, పెళ్లయ్యాక మాత్రం విమర్శిస్తోంది.

ఒక పురుషుడు తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తే, విశ్రాంతిగా సమాజం గుర్తిస్తుంది. అదే మహిళ తన కోసం సమయాన్ని కేటాయించుకుంటే మాత్రం నిందలు వేస్తున్నారు. పురుషులకు సులభంగా లభించే ఈ వ్యక్తిగత స్వేచ్ఛ మహిళల విషయానికి వచ్చేసరికి అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. ఇటీవల పెళ్లైన ఆడవాళ్లపై జరిపిన ఒక అధ్యయనంలో ముఖ్యంగా 31-40 ఏళ్ల వయస్సు వారిలో 46.4 శాతం మంది వైవాహిక జీవితంలో ఉంటూనే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లు తేలింది.

‘ఎల్లప్పుడూ కలిసే ఉండటం వల్ల వ్యక్తిగత సరిహద్దులు తుడిచిపెట్టుకుపోతాయి తప్ప బంధం బలపడదు. భాగస్వామి పక్కనే ఉన్నా మానసికంగా ఒంటరిగా ఫీలయ్యే ప్రమాదం ఉంది’ అని ముంబైకి చెందిన రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్ నమ్రతా జైన్ వివరించారు. వైవాహిక బంధంలో స్పేస్ కోరుకోవడం అంటే దూరం కావడం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read Also: సీజనల్ వ్యాధుల బారిన పడొద్దంటే.. వర్షాకాలంలో తప్పక తినాల్సిన పండ్లు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>