కాంగ్రెస్‌లో భారీ చేరికలు.. యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధీమా

కలం, మహబూబ్‌నగర్ : తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ (Mahabubnagar) ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam) ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హన్వాడ మండలం వేపూర్, మహబూబ్‌నగర్ మండలం ఫత్తేపూర్ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత తొమ్మిదిన్నర ఏళ్లలో జరగని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే చేసి చూపించిందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. వేపూర్ సర్పంచ్ నాయికోట చెన్నయ్య, ఫత్తేపూర్ సర్పంచ్ పి. అశోక్ యాదవ్‌తో పాటు వారి అనుచరులు పార్టీలో చేరడం సంతోషకరమని అన్నారు. మాచన్‌పల్లి, టంకర గ్రామాల నుంచి కూడా బీఆర్‌ఎస్‌కు చెందిన సుమారు వెయ్యి మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు.

కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఆరు కిలోల సన్నబియ్యం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల వంటి హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్.పి. వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>