కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : అమరుల త్యాగాలు, వారి ఆశయాలకు అనుగుణంగా ముందడుగు వేసినప్పుడే వారికి ఘన నివాళి అర్పించినట్లవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. మువ్వన్నెల జెండాను ఎగురవేసి ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పరేడ్‌లో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్‌చంద్రబోస్, భగత్‌సింగ్ వంటి ఎందరో మహనీయులు దేశం కోసం పోరాడారని అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఎందరో బలిదానాలు చేశారని, సబ్బండ వర్గాలు ఉద్యమించాయని జూపల్లి గుర్తుచేశారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
సామాజిక రుగ్మతలపై ప్రభాత భేరి..
స్వాతంత్ర్యం సిద్ధించి 80 సంవత్సరాలు పూర్తవుతున్నా సమాజంలో ఇంకా కొన్ని సాంఘిక దురాచారాలు, సామాజిక రుగ్మతలు వేళ్లూనుకుని ఉండటం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నేటి యువతలో కొందరు మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని ఆందోళన వెలిబుచ్చారు. సమాజంలో నేరాలు, ఘోరాలు, దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు.
స్వాతంత్య్ర భారతం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వంటి ఎన్నో కలలను సాకారం చేసుకున్నామని, అయితే ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ‘ప్రభాత భేరి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత..
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్తోందని మంత్రి జూపల్లి వివరించారు. పాలమూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టిందని, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అంతకుముందు నిర్వహించిన శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

