కొర్లపాడు మోడల్ స్కూల్‌లో స్వాతంత్య్ర వేడుకలు.. ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక సన్మానం

కలం, నకిరేకల్: కొర్లపాడు మోడల్ స్కూల్‌ (Korlapadu Model School) లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు (Independence Day Celebrations) అత్యంత ఉత్సాహంగా, దేశభక్తి పూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో ఒక వినూత్న, అభినందనీయ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల చదువుకు పరోక్షంగా తోడ్పడుతూ సమాజానికి సేవలందిస్తున్న స్థానిక ఆర్టీసీ డ్రైవర్ కుమార్, కండక్టర్ బాధిని గౌతమిలను పాఠశాల యాజమాన్యం వేదికపై ఘనంగా సన్మానించింది.

ప్రతిరోజూ ఎండనకా, వాననకా విద్యార్థులను ఎంతో సురక్షితంగా పాఠశాలకు చేరవేస్తూ, వారి క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసానికి సహకరిస్తున్న ఆర్టీసీ సిబ్బంది సేవలను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కొనియాడారు. డ్రైవర్ కుమార్, కండక్టర్ గౌతమిలకు పాఠశాల తరఫున శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. “సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమైనదే. ప్రతిరోజూ మన పిల్లలను సురక్షితంగా స్కూలుకు చేరవేస్తున్న ఆర్టీసీ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. ఈ స్వాతంత్ర దినోత్సవ వేళ వారిని గౌరవించుకోవడం మన బాధ్యత” అని పాఠశాల ప్రతినిధులు తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆర్టీసీ సిబ్బందిని సన్మానించిన పాఠశాల యాజమాన్యం చొరవను స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు విశేషంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>