కలం, వెబ్ డెస్క్: నల్సార్ (NALSAR) విద్యార్థులకు వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఉత్తర్వులపై దేశ వ్యాప్తంగా లా విద్యార్థులు భగ్గుమంటున్నారు. ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్న ఇప్పటికే బీసీఐ ప్రకటించినా.. వారి ఆగ్రహం చల్లారడం లేదు. వెంటనే అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు చెప్పాలంటూ బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆయన పరిధి దాటి వ్యవహరించారని.. చట్టవిరుద్ధమని ప్రకటన విడుదల చేశారు.
అడ్వకేట్స్ యాక్ట్ 1961లో నిబంధనల ప్రకారం బార్ కౌన్సిల్‌లో విద్యార్థులను నమోదు చేయకుండా నిరోధించే చర్యలు రాజ్యాంగ వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనన్ కుమార్ మిశ్రా నేరుగా విద్యార్థుల ప్రాథమిక హక్కుల మీద దాడి చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ నల్సార్ విద్యార్థులకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
లెటర్ హెడ్ ఎందుకు వాడారు..?
బీసీఐ జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలిస్తే.. మనన్ కుమార్ మిశ్రా సొంత అభిప్రాయమే ఎక్కువ కనిపిస్తోందని లా విద్యార్థులు మండిపడ్డారు. అలాంటప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లెటర్ హెడ్ ఎందుకు వాడారని ప్రశ్నించారు. స్నాతకోత్సవానికి హాజరయ్యే వారి నుంచి విద్యార్థులు ఉన్నత విలువలు, వ్యక్తిత్వం ఆశిస్తారని స్పష్టం చేశారు. మనన్ కుమార్ మిశ్రా ఇక నుంచి తమ యూనివర్సిటీకి కూడా రావొద్దంటూ వ్యతిరేకించారు. అదే సమయంలో సీజేఐ కూడా తమ వర్సిటీ స్నాతకోత్సవానికి రావాలన్న ఆలోచనను విరమించుకుంటారని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు.

