కలం, వెబ్ డెస్క్: విదేశాల్లో మాస్టర్స్, డాక్టరేట్ వంటి ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి’ స్కాలర్షిప్ పథకం గడువును అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. గతంలో సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, విద్యార్థుల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో మరో 15 రోజులు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి.బాల మాయాదేవి సూచించారు.
ఇవే అర్హతలు..
మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించరాదు. అంతేగాకుండా, విద్యార్థి వయస్సు 35 ఏళ్లకు మించి ఉండొద్దు. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే, జీఆర్ఈలో కనీసం 260 మార్కులు, జీమ్యాట్ పరీక్షలో 500 మార్కులు సాధించి ఉండాలి. అదే సమయంలో ఆంగ్ల ప్రావీణ్యత పరీక్షలో టోఫెల్లో 60 మార్కులు లేదా ఐఈఎల్టీఎస్ పరీక్షలో 6.0 బ్యాండ్ లేదా పీటీఈలో 50 మార్కులైనా పొందాలి. http://www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్, ఇతర వివరాలు చెక్ చేసుకోవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.

