Mobile Popup Ad
Mobile Popup Ad

ఇసుక దందా ఆరోపణలపై మంత్రి అడ్లూరి సవాల్

కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి జిల్లా ధర్మారం(Dharmaram)  మండలంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని పరిశీలించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri), ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) చేసిన ఆరోపణలకు ఘాటుగా స్పందించారు. ఇసుక దందాలో తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. తనపై ఎలాంటి ఆధారాలు లేకుండానే కొప్పుల ఈశ్వర్ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇసుక అక్రమ రవాణా విస్తృతంగా సాగిందని, రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ల గ్రామం నుంచి మానేరు ఇసుకను ప్రతిరోజూ వందలాది లారీలలో తరలించేవారని ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణా కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.

నేరేళ్ల గ్రామ దళితులు అక్రమ ఇసుక రవాణాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే, అప్పటి ప్రభుత్వం వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన దాడుల గురించి మాట్లాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గంలో ఇసుక దందాలో తనకు వాట ఉందని మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి అన్నారు. ఇసుక దందాలో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎక్కడైనా తన ప్రమేయం ఉందని రుజువు చేస్తే వెంటనే రాజీనామా చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కొప్పుల ఈశ్వర్‌కు సూచించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ధర్మారం మండలంలో తడిసిపోయిన ధాన్యం, మక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>