కలం, తెలంగాణ బ్యూరో : ‘ఎల్ నినో’ ప్రభావం కారణంగా ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నదని వాతావరణ శాఖ హెచ్చరించడంతో వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ముందస్తు జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో సైతం వర్షాభావ పరిస్థితులు అనివార్యమనే అంచనాలు వస్తుండడంతో రైతులకు పంటల మార్పిడి, వైవిధ్యంపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాతావరణ అంచనాలు, నివేదికల ఆధారంగా పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. తక్కువ నీరు వినియోగించుకునే పంటలు, వాటి సాగుపై రైతువేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన వీడియోలను ప్రదర్శించాలని సూచించారు. టీవీ ఛానెళ్లలో ఈ వియాయోలు ప్రసారమయ్యేలా చూడాలన్నారు. అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరాలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై సూచనలు :
‘ఎల్ నినో’ ప్రభావంపై వాతావారణ శాఖ నివేదికలతో కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా జలాలు దక్కేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలోని డ్యామ్‌లు నిండిన తర్వాతే నీళ్లు వదిలే విధానాన్ని పాటిస్తే ఇబ్బందులు తప్పవని, అంతరాష్ట్ర జలాల్లో ప్రొరేటా ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటా జలాలు వచ్చేలా ఆ రాష్ట్రాల అధికారులతో ముందుగానే చర్చించి తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. మహారాష్ట్రలోని కోయనా డ్యామ్ నీటిని వంద శాతం జల విద్యుదత్పత్తికే వినియోగిస్తున్నందున ఆ మొత్తం నీటిని మనం తీసుకొని వారికి అవసరమైన విద్యుత్ మనం సరఫరా చేసే అంశంపై ఆ రాష్ట్ర అధికారులతో చర్చించాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. గోదావరి నది నుంచి ఏటా వేల టీఎంసీల జలాలు సముద్రం పాలవుతున్నాయని, గోదావరితో పాటు ప్రాణహిత నుంచి వచ్చే నీటిని మళ్లించడంపై స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నిర్మించిన సీలేరు, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో తెలంగాణకు రావాల్సిన వాటాపై నివేదిక రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
డ్యామ్‌ల గేట్లకు మరమ్మతు పనులు :
రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌ల గేట్ల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. మెయింటెనెన్స్‌పై అధికారులను వివరాలడిగారు. గతంలో కడెం ప్రాజెక్టులో తలెత్తిన ఇబ్బందులను గుర్తుచేశారు. ఈ అవసరాల కోసం ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేశామని ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఎన్ని నిధులు అవసరమైనా వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. డ్యామ్‌ల విషయంలో ఇబ్బందులు తలెత్తితే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతేడాది వరదల సమయంలో కామారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించిన సమయంలో ఇచ్చిన హామీల అమలుపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి, పశు నష్టం వాటిల్లినప్పుడు తక్షణమే అధికారులు స్పందించాలన్నారు. వడగాలులు, వరదల్లో ప్రాణాలు, ఆస్తులు కోల్పోతే ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూడాలన్నారు. వరదలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు, కూలిన వంతెనల స్థానంలో కొత్త నిర్మాణం తదితరాలకు విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ.1000 కోట్లను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలన్నారు.
హైదరాబాద్‌లో ఇంకుడు గుంతల నిర్మాణం :
‘క్యూర్’ (కోర్ అర్బన్ రీజియన్) పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో వర్షాకాలంలో రోడ్లపై వరద నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నీరు నిలిచే 141 ప్రదేశాలను గుర్తించి వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని గతంలో నిర్ణయించిన పనుల పురోగతిపై ఆరా తీశారు. ఇప్పటికే 11 వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పూర్తి చేశామని, మిగతా వాటి పనులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. ఆ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీనియర్ అధికారి జయేశ్ రంజన్‌ను ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి ముగ్గురు కమిషనర్లు, మూడు నగరాల పోలీస్ కమిషనర్లు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఏ ప్రాంతాలోనూ తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితికి తగినట్లు తాగు నీరు, విద్యుదుత్పత్తి, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కేటాయింపులు చేయాలన్నారు. వర్షాలకు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిని సరఫరా నిలిచిపోతే తక్షణమే స్పందించి మరమ్మతులు పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు.
రామగుండం ఫ్యాక్టరీ యూరియా మొత్తం మనకే :
రామగుండం ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తం తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులతో ఒకవైపు పంటల మార్పిడిపై దృష్టి పెడుతూనే మరోవైపు విత్తనాలు, ఎరువులకు కొరత రాకుండా చూసువాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. జిల్లాల స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు నిర్ణీత సమయంలో భేటీ అవుతూ ఉంటే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. మండల స్థాయిలోనూ రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్య, విద్యుత్, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
రాష్ట్రానికి అదనపు యూరియాకు కేంద్రం ఓకే :
రాష్ట్రంలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో నెలకు 10 లక్షల టన్నులు సరిపోదని, అదనంగా మరో లక్షన్నర టన్నులు ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి ఇంకో 2 లక్షల టన్నుల యూరియాను ప్రత్యేకంగా కేటాయించాలని విజ్ఞప్తిని మాత్రం సున్నితంగా తిరస్కరించారు. దేశీయంగా ఉత్పత్తయ్యే యూరియాను ‘పూల్ విధానం’ ద్వారా అన్ని రాష్ట్రాలకూ సమానంగా పంపిణీ చేయాల్సి ఉంటుందని, మొత్తాన్ని తెలంగాణకే కేటాయించడం సాధ్యం కాదని వివరించారు. నౌకాశ్రయాలు, రైల్వే గోడౌన్లలో తెలంగాణకు కేటాయించిన యూరియా రవాణాకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ఆ శాఖలకూ సంబంధిత మంత్రులు ఆదేశాలిచ్చినట్లు రాష్ట్ర మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో తెలిపారు. లోడింగ్, అన్‌లోడింగ్, రైల్వే రేక్‌ల కేటాయింపు, నిల్వల తరలింపు పురోగతిని పర్యవేక్షించేందుకు రాష్ట్రం ప్రత్యేక అధికారులను నియమించింది. పోర్టులు, ఎరువుల సంస్థలు, రైల్వే శాఖలతో సమన్వయం చేసుకుని యూరియా రవాణాలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆ అధికారులకు మంత్రి సూచించారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్‌పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Instagram

