కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరులూదిన అస్తిత్వాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న ఆంధ్రా నాయకుల విగ్రహాలను తొలగిస్తామని, వాటిని పార్సిల్ చేసి అక్కడికి పంపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పన్నెండేండ్లయినా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. టీఆర్ఎస్ 2.0తో పెట్టుకుంటే మూతి పళ్లు రాలుతాయని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ అస్తిత్వం, స్వాభిమానం, హక్కులపై ఎలాంటి దాడి జరిగినా సహించబోమన్నారు. ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తూ వారి త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని, ఉద్యమకారుల కుటుంబాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంతకాలం భావజాలాన్ని గౌరవించే పరిస్థితి ఉందని.. ప్రస్తుతం అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ రాజధాని నిర్మాణం పూర్తికాలేదని ఆమె అన్నారు. ‘తెలంగాణ’ అనే పదం డిక్షనరీలోనే లేదు అని మహానాడు వేదికగా కామెంట్ చేయడం అవివేకం అని ఆమె అన్నారు
తెలంగాణ లో ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంట్ సీఎంగా ఉండటంతో ఇక్కడ ఆంధ్రా నాయకుల విగ్రహాలు పెడుతూ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అయితే టీఆర్ఎస్ జెండా రాకముందు ఒకలా, ఇప్పుడు ఒకలా ఉన్నామన్న ఆమె.. తమ అస్తిత్వంపై దాడి చేస్తూ మీ సంస్కృతి రుద్దుతామంటే ఊరుకోమన్నారు. టీఆర్ఎస్ 2.0 అధికారంలోకి రాగానే ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలకొట్టి పార్సల్ పంపుతామని హెచ్చరించారు.
తెలంగాణతో కలిసినప్పుడు కూడా మన రాజధాని మీద కన్నేసి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని కలుపుకున్న ఆంధ్ర ప్రాంతం వారు.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 ఏళ్లు అవుతున్న వాళ్లు రాజధాని కట్టుకోలేదని చెప్పారు. ఏపీలో ఇప్పుడు ఉన్న తెలుగుదేశం, జనసేన సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంట్ లో వాళ్ల రాజధాని మీద తీర్మానం చేయించుకున్నారన్న ఆమె.. ఎవరైనా రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం చేయించుకుంటారు, కానీ వాళ్లు మాత్రం పార్లమెంట్ లో తీర్మానం చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం విషయంలో సంకీర్ణ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పారు. అమరావతి రాజధాని అంటే జగన్ మాత్రం మావిగన్ పేరుతో వారిపై రాజకీయ బాంబు వేశారని పేర్కొన్నారు.

