కలం, కరీంనగర్ బ్యూరో : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) అన్నారు. జగిత్యాల (Jagtial) జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని(Dr BR Ambedkar Statue), శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గం దేశానికి ఆదర్శమని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
అంబేద్కర్ ఆశయాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, విద్య, ఉపాధి రంగాలలో పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులకు రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రుణమాఫీ, సన్నధాన్యం పండించిన రైతులకు బోనస్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో అసమానతలను నిర్మూలించేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజాసంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

