కేసీఆర్ చావును కోరుకోలేదు : మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావును ఎవరూ కోరుకోలేదని, ఆయనకు గౌరవం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ తో పాటు పలువురు నేతలతో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలను అడ్లూరి తీవ్రంగా ఖండించారు. అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన ఎస్సీ వర్గీకరణ బిల్లు సందర్భంగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరినప్పుడు సీఎం అసెంబ్లీకి రాలేదనన్నారు. బీసీలకు 42 శాతం బిల్లు విషయంలో సైతం కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని గౌరవంగా ఆహ్వానించారని, అయినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని మంత్రి విమర్శించారు.

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి రైతుబంధు (Rythu Bandhu) వేసినప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ను అగ్గువకు కుదువపెట్టి రైతుబంధు డబ్బులు జమ చేశారని మంత్రి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులకు ప్రతినెలా రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడుతున్నారని.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న జానారెడ్డి, భట్టి విక్రమార్క ఏనాడు ఏకవచనంతో ముఖ్యమంత్రిని అమర్యాదగా మాట్లాడలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు పోవాలని అంటున్నారని ఎందుకు పోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. 2014, 2018లో బీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు.

ధాన్యం కొనుగోలుపై జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) తీవ్ర అభ్యంతరం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తరుగు, తప్ప, తాలు పేరుతో తూకంలో కోతలు విధించేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇవ్వడంతో పాటు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని.. వర్షాకాలం పంటకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో సీనియర్ సభ్యులుగా ఉన్న వారి నుంచి కొత్తగా ఎన్నికైన తాము సభ మర్యాదలు నేర్చుకుందామని అనుకుంటే బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తున్నారన్నారు. సీనియర్ సభ్యులు కొత్తగా ఎన్నికైన వారికి నేర్పించే మర్యాద ఇదేనా అని మంత్రి మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన మంత్రి వర్గ సహచరులతో ఏనాడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే అధికారం..

కేసీఆర్ ఏం మాట్లాడినా కుటుంబంలోని హరీశ్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులతో మాత్రమే అని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు. రెండున్నర సంవత్సరాల క్రితం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి క్యాబినెట్లో అవకాశం కల్పించారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ అన్ని వర్గాలను సమానంగా చూస్తూ.. సమాన అవకాశాలు కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గోదాముల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను కేంద్రంతో మాట్లాడి తరలించే ప్రక్రియను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం కేసు విషయం సీబీఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని బండి సంజయ్ ఈ విషయంలో చొరవ తీసుకొని సీబీఐ విచారణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ముఖ్యమంత్రితో త్వరలో జగిత్యాలలో సభ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించిన మంత్రి ఆ శాఖ మంత్రి కార్మిక సంఘాల నేతలతో మాట్లాడుతారని చెప్పారు. గత ప్రభుత్వం లాగా తాము ఆర్టీసీ కార్మికుల ఇబ్బంది పెట్టమని అడ్లూరి తెలిపారు. సమావేశంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్, మాజీ ఎంపీపీ పడితపెల్లి కిషన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పురుమళ్ళ మనోహర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రోమాల రమేశ్, బైరిశెట్టి సంపత్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Read Also: తెలంగాణ మరో బంగ్లాదేశ్‌గా మారుతుంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>