కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతా చర్యల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా (Mahabubnagar) కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta), జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (SP) జానకితో కలిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా, రోడ్లు & భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ హైదరాబాద్ నుంచి వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల అమలు, వివిధ శాఖల బాధ్యతలు, సమన్వయ చర్యలపై వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సమీక్షించారు.
మీటింగ్ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారులపై అనధికారికంగా భారీ వాహనాలు (Illegal Vehicle Parking) నిలిపివేయకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలను నిలపడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారులపై ఆక్రమణలను తొలగించడం, అక్రమ నిర్మాణాలను నివారించడం, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం, పౌరుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయడం, డ్రోన్ సర్వేల ద్వారా ఆక్రమణలను గుర్తించడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అలాగే జిల్లా స్థాయిలో హైవే భద్రతా టాస్క్ ఫోర్స్‌ను సమర్థవంతంగా పనిచేయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పోలీసు, రవాణా శాఖ, జాతీయ రహదారుల సంస్థ, ఇతర సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంపొందించాలని సూచించారు. జాతీయ రహదారులపై నిఘా, పహారా వ్యవస్థను బలోపేతం చేయడం, అత్యవసర వైద్య సేవలు, రికవరీ వాహనాలు, ట్రక్ లే-బై సౌకర్యాలు, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు, తగిన లైటింగ్, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు వంటి రహదారి భద్రతా చర్యలను వేగవంతం చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను నిర్దేశిత గడువులోగా పూర్తిస్థాయిలో అమలు చేసి, శాఖలవారీగా అనుసరణ నివేదికలు సమర్పించాలని సూచించారు.

