కలం, వెబ్ డెస్క్ : నీట్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్లు మారుస్తూ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చర్చలకు అంగీకరించి మాట తప్పారని పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రధాని మోదీ నివాసం ముందు ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ డిమాండ్లను విన్న కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్దకు వెళ్లారు. అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమై రాహుల్ ప్రతిపాదించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అమిత్ షా ఇచ్చిన దిశానిర్దేశం మేరకు హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌తో కలిసి జితేంద్రసింగ్ మళ్లీ రాహుల్ గాంధీని కలిసి ప్రభుత్వం తరఫున చర్చలు జరిపారు.
అయితే ఈ చర్చల అనంతరం కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. నీట్ అంశంపై పార్లమెంట్ లో చర్చించాలని రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ కు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ తన మాటను తప్పారని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టడంతో పాటు మరో రెండు కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇలా మాటిమాటికీ డిమాండ్లు మారుస్తూ, మాట తప్పడం ఎంతమాత్రం సముచితం కాదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండి మాట తప్పడం దురదృష్టకరమని తెలిపారు. రాహుల్ గాంధీ తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.

