Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రోల్ రేట్ల పెంపుపై జగిత్యాలలో మంత్రి అడ్లూరి ఆందోళన

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల (Jagtial) జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప పేద ప్రజల సంక్షేమం ఏనాడు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్ ధరల విషయం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

ఎన్నికలు అయిపోయిన వెంటనే పెంపు..

తమిళనాడు, కేరళ, బెంగాల్ ఎన్నికల పూర్తయిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని మంత్రి అడ్లూరి ఆరోపించారు. మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను విలాసాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిందని.. అంటే దేశ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని భావించవచ్చన్నారు. రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతున్నా. మోదీ మాత్రం నిద్ర లేవడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, జీవన్ రెడ్డి ఎందుకు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడం లేదని మంత్రి ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు బండి భగీరథ్ అంశంపై కూడా నోరు మోదపడం లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటేనని మంత్రి అడ్లూరి అన్నారు.

ధాన్యం, మక్కల కొనుగోళ్లపై శ్రద్ధ లేదు..

కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మీద ఉన్న శ్రద్ధ.. ధాన్యం, మక్కల కొనుగోళ్లపై లేదని మంత్రి అడ్లూరి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు పంటల వడ్లు కొనుగోలు చేస్తే, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్‌సీఐ మాత్రం బియ్యం సేకరించడం లేదన్నారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మిగిలిన లక్ష 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం ఛైర్మన్ జువ్వాడి నర్సింగ్ రావు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య, జగిత్యాల మున్సిపాల్ ఛైర్మన్ సమిండ్ల వాణి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>