Mobile Popup Ad
Mobile Popup Ad

ఓట్ల తొలగింపుతో బీజేపీ కుట్ర.. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా నుండి ఓట్లు తొలగించి అధికారంలోకి రావడానికి కుట్ర చేస్తుందని ఈ కుట్రను భగ్నం చేయాల్సిన బాధ్యత బూత్ లెవల్ పోలింగ్ ఏజెంట్లపై ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై జగిత్యాల (Jagtial) జిల్లా ధర్మపురి నియోజకవర్గ బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమం సోమవారం ధర్మపురిలోని ఎస్‌హెచ్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతుందని అన్నారు. ఇందులో భాగంగా ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. బీజేపీ చేపట్టిన ఓట్ల తొలగింపు కుట్రను అడ్డుకోవడానికి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బూత్ స్థాయిలో పోలింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి ఓట్లు కాపాడాలని ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో SIR నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

ధర్మపురి నియోజకవర్గంలోని 269 పోలింగ్ బూతుల పరిధిలో 2.37లక్షల ఓటర్లు ఉన్నట్లు మంత్రి వివరించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలంటే బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటు నమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంతే కాకుండా ఈనెల ఓటర్ల వద్దకు వచ్చే బూత్ లెవెల్ పోలింగ్ అధికారులకు అన్ని రకాల సమాచారం అందజేయాలని సూచించారు. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి అడ్లూరి మరో మారు స్పందించారు.

ఇద్దరు నాయకులు అబద్దాలతో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలని చూస్తున్నారని మంత్రి అడ్లూరి అన్నారు. మాజీ మంత్రులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందని అన్నారు. వడ్ల కొనుగోలు, ఇసుక రవాణాలో తాను అవినీతికి పాల్పడ్డట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి మరో మారు సవాలు విసిరారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి లాగా తాను నాయకులను వర్గాలుగా విభజించి మాట్లాడడం తనకు తెలియదని అన్నారు. ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు వెన్నుదన్నుగా నిలుస్తానని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

ఇంటింటికి తిరిగి ఓటు హక్కును కాపాడాలి..

ధర్మపురి నియోజకవర్గంలోని బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్లు ఇంటింటికి తిరిగి ప్రతి ఓటును కాపాడి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కును అందరూ ఉపయోగించుకునే విధంగా కృషి చేయాలని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ రుద్ర సంతోష్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో 2.37 లక్షల మంది ఓటర్లు ఉండగా ఇందులో 43 వేల ఓట్లు ఓట్లుగా ఉన్నాయని 47 వేల ఓట్లు అనుమాలిస్ ఓట్లుగా ఉన్నాయని సంతోష్ తెలిపారు. నియోజకవర్గంలో దాదాపు 90వేల ఓట్లు ప్రమాదంలో ఉన్నాయని ఈ ఓట్లను కాపాడాల్సిన బాధ్యత బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్ పై ఉందని అన్నారు.

ఈనెల 26వ తేదీ నుండి వచ్చేనెల 25వ తేదీ వరకు ప్రతి ఇంటికి బూత్ లెవెల్ పోలింగ్ ఆఫీసర్ వస్తారని, ఓటర్ కు సంబంధించిన అన్ని రకాల పత్రాలను అందజేయాల్సిన బాధ్యతను బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్లు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మితో పాటు ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్, తదితరులు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>