కలం, కరీంనగర్ బ్యూరో : కొండగట్టు ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణకు సీఎం రేవంత్ రెడ్డి ని ఒప్పించి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Minister Adluri Laxman) అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో అడ్లూరి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు మంత్రికి పుర్ణకుంభంతో స్వాగతం పలకగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈసందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, గిరి ప్రదక్షిణ కోసం నిధుల విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గిరి ప్రదక్షిణ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ, పోలీసు శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై, ప్రజలపై ఉండాలని ఆకాంక్షించినట్లు మంత్రి అడ్లూరి తెలిపారు. జిల్లా అధికారులు స్థానికంగా ఉండి భక్తులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

