కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య (IPS officer Wife) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య వెనుక పనిమనిషి కల్పనతో పాటు నేపాల్‌కు చెందిన సాహూ గ్యాంగ్ హస్తం ఉందని తేలింది. ఇందుకోసం దిల్లీ జైల్లోనే స్కెచ్ వేశారని తెలంగాణ పోలీసులు గుర్తించారు. ముంబయి, నేపాల్, పట్నా నుంచి వేర్వేరు వ్యక్తులను కల్పన ద్వారా రప్పించిన ముఠా.. పక్కా స్కెచ్ వేసి తనూజను హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. దోపిడీ చేసిన బంగారాన్ని ముంబయిలో దాచినట్లు గుర్తించి.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితురాలు కల్పన కోసం పుణేలో గాలిస్తున్నారు.
పక్కా స్కెచ్ వేసి మరీ..
పని మనిషి అంటూ వినయ్ రంజన్ రే ఇంట్లోకి ప్రవేశించిన కల్పన.. ఎక్కడ బంగారం, డబ్బులు పెడుతున్నారనే విషయాలు నిరంతరం గమనించేది. మూడు అంతస్థుల ఇంట్లో ఆమెకి పైన ఒక రూంను కేటాయించగా.. అక్కడే ఉండేది. ఇంటి వ్యవహారాలపై పూర్తి పట్టు వచ్చాక.. సమయం కూడా వేచి చూసింది. వినయ్ బయటకు వెళ్లారని తెలుసుకుని అర్ధరాత్రి తన ప్రణాళికను అమలు చేసి, డబ్బు, బంగారంతో ఉడాయించింది. కల్పన నేపాల్ సరిహద్దుల్లో నుంచి పారిపోయే అవకాశం ఉందని తెలిసి.. ఎస్ఎస్‌బీ అధికారులను సైతం తెలంగాణ పోలీసులు అప్రమత్తం చేశారు. కల్పన తల్లిదండ్రులను ఇప్పటికే అదుపులోకి తీసుకోగా.. ఆమె భర్త బెంగళూరులో ఉంటున్నట్లు గుర్తించి పట్టుకునేందుకు అక్కడికి వెళ్లారు.

