కలం, నల్లగొండ బ్యూరో : పొట్టకూటి కోసం వలస వచ్చిన ఓ కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పని నిమిత్తం వచ్చిన ఓ కూలిపై దుండగులు రాళ్ళతో దాడి చేయగా, ఒక కూలీ మరణించాడు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ దారుణ ఘటన నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా తెలికపల్లి గ్రామానికి చెందిన చంద్రు రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందులో భాగంగానే నల్లగొండ రైల్వే స్టేషన్ (Nalgonda Railway Station ) లో జరుగుతున్న ఆధునీకరణ పనులలో భాగంగా రైల్వే స్టేషన్ పనుల నిమిత్తం నల్లగొండకు వచ్చాడు.
ఈ క్రమంలోనే రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పని చేస్తున్న కార్మికుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ కారణంగా కంకర రాళ్లతో దాడి చేసుకోవడంతో ఒక వ్యక్తి మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ అనంతరం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.


