కలం, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం (Microsoft 365 Outage) ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట (అమెరికా కాలమానం ప్రకారం) సమయంలో ఈ సమస్య మొదలైంది. దీనివల్ల Microsoft Outlook, Exchange Online, Teams, SharePoint, Copilot వంటి కీలక సేవలు నిలిచిపోవడంతో లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.
అవుటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ Downdetector ప్రకారం, సమస్య మొదలైన కొద్దిసేపటికే దాదాపు 1,30,000 మందికి పైగా వినియోగదారులు తమకు ఇమెయిల్స్, ఇతర సేవలు పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. మొదట అమెరికా ప్రాంతాల్లోనే ఈ అంతరాయం ఉన్నట్లు గుర్తించినప్పటికీ, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని మైక్రోసాఫ్ట్ 365 కనెక్టివిటీపై దీని ప్రభావం పడినట్లు మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.
ట్రాఫిక్ పెరగడం వల్ల ఈ సమస్య రాలేదని, పలు సర్వర్లు హెల్త్ చెక్స్‌లో విఫలమై పనిచేయకపోవడంతో మిగిలిన సర్వర్లపై అదనపు లోడ్ పడిందని మైక్రోసాఫ్ట్ వివరించింది. EX1550543 ఇన్సిడెంట్ కింద ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్న సంస్థ, ప్రస్తుతం కొత్త డెప్లాయ్మెంట్లను నిలిపివేసింది. దెబ్బతిన్న సర్వర్లను రీస్టార్ట్ చేస్తూ, కాన్ఫిగరేషన్ లోపాలను సరిదిద్దే పనిలో నిమగ్నమైంది. ట్రాఫిక్‌ను ఇతర ప్రాంతాల్లోని సర్వర్లకు మళ్లిస్తుండటంతో ఉత్తర అమెరికాలో టీమ్స్ సేవలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, మరికొన్ని చోట్ల కనెక్టివిటీ సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
Also Read : రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన.. కేటీఆర్ ప్రశ్నల వర్షం!
Follow Us On: X(Twitter)

