జ‌గ్గారెడ్డికి సినిమా సిండ్రోమ్.. పార్టీ శ్రేణుల్లో కలవరం!

క‌లం, మెద‌క్ బ్యూరో: రాజకీయాల్లో ఆయనో ఫైర్ బ్రాండ్. నిత్యం ఏదో అంశంతో మీడియాలో హైలెట్ అవుతుంటారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా సామాన్యుడిగా జనంతో మమేకమై హ‌ల్ చ‌ల్ చేస్తుంటారు. ఆయనే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy). అస‌లు పేరు తూర్పు జ‌య‌ప్రకాశ్ రెడ్డి. మూడు సార్లు సంగారెడ్డి ఎమ్మెల్యేగా ప‌నిచేసిన జ‌గ్గారెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయాడు. అప్పటి నుంచి అధిష్టానం ఆదేశాలతో పార్టీ కార్యక్రమాలు, నిర‌స‌న‌లు, ఆందోళనలో నిమగ్నమయ్యారు. త‌న‌కు ప్రజ‌లు, రాజ‌కీయాలే తొలి ప్రాధాన్యతని, కుటుంబ‌మే త‌ర్వాత అని ప‌లు సంధ‌ర్భాల్లోనూ ఆయన స్పష్టం చేశారు. ప్రసుత్తం టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడింట్ జ‌గ్గారెడ్డి ఉన్నారు.

నటుడిగా అవతారమెత్తానని ప్రక‌టించి..

తన పేరుతోనే ‘జగ్గారెడ్డి – ఏ వార్ ఆఫ్ లవ్’ పేరుతో సినిమా తీస్తున్నట్టు 2025 మార్చిలో ప్రకటించి హాట్ టాపిక్ అయ్యారు. అది ప్రేమ కథ చిత్రమని, ప్రత్యేక పాత్ర పోషిస్తున్నానని జ‌గ్గారెడ్డి స్వయంగా వెల్లడించి అందరినీ ఆశ్చర్య పరిచారు. రాష్ట్ర నాయకత్వంతో పాటు ముఖ్యమంత్రి అనుమతి తీసుకుని సినిమాలో నటిస్తానని జగ్గారెడ్డి అప్పట్లో తెలిపారు. మూవీ పోస్టర్స్ ను కూడా విడుద‌ల చేశారు. అది కాస్త రాజ‌కీయ, సినిమా వ‌ర్గాల్లో వైర‌ల్ గా మారింది. సినిమా నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవారిని చూశాం కానీ.. రాజ‌కీయాల నుంచి నటనవైపు జ‌గ్గారెడ్డి వెళ్లడం చ‌ర్చ‌నీ యాంశమైంది. సంగారెడ్డి టౌన్ లో జ‌గ్గారెడ్డిపైన‌ పాట చిత్రీక‌ర‌ణ కూడా జరిగినట్టు చెబుతుంటారు. కానీ సినిమా నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. వెండితెర మీద త‌మ అభిమాన నేత న‌ట‌న‌ను చూద్దామని మురిసిపోయిన‌ అభిమానుల‌కు నిరాశే మిలిగింది.

అధినేత్రి సోనియాపై మూవీకి ప్లాన్..

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా రాసిన ‘ బిలాంగింగ్ : ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం ఆధారంగా ఆమె జీవితాన్ని తెలుగులో తెరకెక్కిస్తామని తాజాగా జగ్గారెడ్డి (Jagga Reddy) ప్రకటించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సినిమా నిర్మాణ ప్రక‌ట‌న చేశారు. త‌ను నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే నిర్మాతలుగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఎన్నిక‌లు, పార్టీ నిర్వహ‌ణకు సాధారణంగా రాజ‌కీయ నేతలు క‌మిటీలను ఏర్పాటు చేస్తారు. కానీ సినిమా నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు 50 మందితో కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. గాంధీ భవన్ పీఆర్వో హరిప్రసాద్ పర్యవేక్షిస్తారని చెప్పారు.

నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ నేతలు సినిమా నిర్మాణానికి నిధులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. “ఎన్నికలకు ఖర్చు పెడతారు కదా. దీన్నీ అలాంటి ఖర్చుగానే అనుకోండి. బడ్జెట్ సమీకరించి, మంచి దర్శకుడిని ఎంపిక చేద్దాం” అని కార్యకర్తలకు చెప్పారు. సోనియా గాంధీపై చిత్ర నిర్మాణానికి రూ. 2 కోట్లు ఇస్తానని నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు ముందుకొచ్చారు. నిధుల స‌మీక‌ర‌ణ,ఇత‌ర ఏర్పాట్లు పూర్తయ్యాక సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ను ఆహ్వానించి షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. త‌ను తీయ‌బోయే సినిమాలో సోనియా గాంధీ కుటుంబ జీవితం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు తెర‌కెక్కిస్తానని కూడా పేర్కొన్నారు.

పార్టీ కేడర్ పెదవి విరుపు

జ‌గ్గారెడ్డి సినిమా ప్రక‌ట‌న‌లతో పార్టీ నియోజ‌క‌వ‌ర్గ నేతలు, కార్యక‌ర్త‌ల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. త‌మ‌కు సంబంధం లేని వ్యవ‌హారాల్లో త‌ల‌దూర్చడం అవసరమా..? అని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్య‌ర్థులను అప్పులు చేసి ఖ‌ర్చులను భ‌రించాల‌ని, ఎలాంటి సాయం చేయలేనని బ‌హిరంగంగానే జ‌గ్గారెడ్డి ప్రక‌టించారు. ఇప్పడు సోనియా గాంధీ సినిమా నిర్మాణానికి నిధులు సిద్ధం చేసుకోవాలని చెప్పడంపై పెద‌వి విరుస్తున్నారు. సినిమా నిర్మాణానికి క‌మిటీ ద్వారా సొంత కార్యక‌ర్తలు, నేతలు నిధుల స‌మీక‌ర‌ణ ఆలోచ‌న చేయ‌డం ఏమిటో అర్థంకాక త‌లలు ప‌ట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నిక‌లు ఖ‌ర్చులు, త‌మ నేత ప‌లు పండ‌గ‌ల సంద‌ర్భంగా ఆర్భాటంగా నిర్వహించే వేడుక‌ల‌కు ఖ‌ర్చులు త‌డిసిమోపెడు అవుతున్నాయని గుర్తుచేస్తున్నారు.

ఇప్పడు సినిమా నిర్మాణానికి ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందోనని ల‌బోదిబోమంటున్నారు. ఇప్పటికే రూ. కోట్లలో అప్పులు ఉన్నాయ‌ని, పండుగ‌లు వ‌స్తే చాలు పైస‌లు లేక‌ సోష‌ల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నామ‌ని పేర్కొంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో న‌మ్ము కున్న కార్యక‌ర్త‌లు, నేతల నుంచి కోట్లలో నిధులు స‌మీక‌రించి సినిమా ఊబిలో దిగ‌డం అవ‌స‌ర‌మా.. అని చ‌ర్చించుకుం టున్నారు. ఇప్పటికైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు బ‌లం పెంచుకొని గెలుపు ల‌క్ష్యంగా ప‌ని చేయాలని, సినిమాలు , యాక్షన్ అంటూ తిరిగితే జ‌నాల్లో ప‌ల‌చ‌న అవుతామ‌ని అంటున్నారు. మొత్తానికి జ‌గ్గారెడ్డి సినిమా సిత్రాలు సంగారెడ్డిలో భ‌విష్యత్ రాజ‌కీయాల‌ను ఎటూ మ‌లుపు తిప్పుతాయో వేచి చూడాల్సిందే.ః

మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో..

1995లో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ ప్రస్థానం నుంచి ఇప్పటి వ‌ర‌కు ముప్పై ఏళ్లుగా సీరియస్ గా రాజ‌కీయాలు చేసిన ఆయన కొన్నాళ్లుగా సినిమా పేరుతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఏడాదిన్నరగా ఆయన చూపు సినిమా వైపు మళ్లినట్టు చర్చలో ఉంది. లీడర్ నుంచి యాక్టర్ గా మారి వెండితెరపై త‌న యాక్టింగ్ తో మెరుద్దామ‌నే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఆత్మకథ పుస్తకంతో నిర్మాతగా సినిమా తెరకెక్కిస్తానని ప్రకటించారు. దీంతో తమ నేత సినిమా మోజుపై పార్టీ కార్యకర్తల్లో హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>