కలం, వెబ్ డెస్క్: కోల్‌కతా వేదికగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్ లైనప్ తేలిపోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. టేలెండర్ కార్బిన్ బోస్క్ 32 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత రెండో స్థానంలో 26 పరుగులతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. దీనిని బట్టే ముంబై టాప్ ఆర్డర్ ఎంత చెత్తగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా కనీసం స్కోర్ చేలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ రయాన్ రికెల్టన్ కేవలం 6 పరుగులకే కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే నమన్ ధీర్ కూడా డకౌట్‌గా వెనుతిరగడంతో ముంబై 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ సైతం రెండు సిక్సర్లు బాదినా.. 15 పరుగుల వద్ద సౌరభ్ దూబే బౌలింగ్‌లో అవుటయ్యాడు. కాసేపు మెరుపులు మెరిపించిన సూర్యకుమార్ యాదవ్ 6 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 15 పరుగులు చేసి దూబే బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ 32 బంతుల్లో 20 పరుగులు చేసి నిదానంగా ఆడినా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. విల్ జాక్స్ 14 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన కార్బిన్ బోస్క్ అద్భుతంగా ఆడాడు. కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు సాధించింది. దీపక్ చాహర్ 10 పరుగులు చేసి ఆఖరి ఓవర్లో కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
కోల్‌కతా బౌలర్లలో సౌరభ్ దూబే (2/34), కామెరాన్ గ్రీన్ (2/23), కార్తీక్ త్యాగి (2/37) చెరో రెండు వికెట్లతో ముంబై నడుము విరిచారు. సునీల్ నరైన్ కూడా 4 ఓవర్లలో కేవలం 13 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టి ముంబై బ్యాటర్లను కట్టడి చేశాడు. వరుణ్ చక్రవర్తి వికెట్ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇప్పుడు కేకేఆర్ విజయలక్ష్యం 148 పరుగులుగా ఉంది.

