కలం, నల్లగొండ బ్యూరో: అది మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU Nalgonda).. 18 కోర్సులు.. 2 వేల మందికి పైగా విద్యార్థులు.. కానీ వసతుల విషయానికొస్తే మాత్రం నామ్ కే వాస్తే అని చెప్పాలి. ఓ వైపు ప్రొఫెసర్ల కొరత, మరోవైపు వసతి గృహాల్లో విద్యార్థుల అవస్థలు.. ఇలా ఏళ్ల తరబడిగా సమస్యలు వెంటాడుతున్నా, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేకపోవడం గమనార్హం. ప్రధానంగా విద్యార్థులకు ఉన్నత విద్యను బోధించే ప్రొఫెసర్ల కొరత ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 ఏళ్లుగా వర్సిటీని పట్టి పీడిస్తోంది. కొండంత ఆశతో యూనివర్సిటీలోకి వస్తున్న విద్యార్థులకు కనీస ప్రమాణాలతో బోధన అందే పరిస్థితి లేదు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు లేక ఏళ్ల తరబడిగా గెస్ట్ లెక్చరర్లు, కాంట్రాక్టు లెక్చరర్లతోనే వర్సిటీ బోధన విభాగం నడుస్తోంది.
70 పోస్టులకు 35 ఖాళీలే
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో (MGU Nalgonda) ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 70 పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో ఈ 18 ఏళ్ల కాలంలో కేవలం 35 రెగ్యులర్ పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన పోస్టులు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి ఒక్కో కోర్సుకు కనీసం ఏడుగురు ఫ్యాకల్టీ అవసరం ఉండగా, ముగ్గురికి మించి లేకపోవడం గమనార్హం. ఇందులో కొసమెరుపు ఏంటంటే.. వర్సిటీలో ఉన్న మొత్తం 70 పోస్టుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రొఫెసర్ లేరు. అసోసియేట్ ప్రొఫెసర్లు ఆరుగురు ఉండగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 29 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అకాడమిక్ కన్సల్టెంట్ల తరగతులే విద్యార్థులకు దిక్కయ్యాయి. మరోవైపు ఇంజనీరింగ్ కాలేజీ విభాగం పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. గెస్ట్ లెక్చరర్లు, కాంట్రాక్టు అధ్యాపకులతోనే ఇంజనీరింగ్ విభాగం మొత్తం కొనసాగుతోంది.
బోధనేతర సిబ్బంది విషయంలోనూ అదే నిర్లక్ష్యం
ఎంజీ వర్సిటీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. బోధన సిబ్బంది మాత్రమే కాదు, బోధనేతర సిబ్బంది విషయంలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఆయా బ్రాంచ్‌ల్లో సిబ్బంది లేక పాలన కుంటుపడింది. ప్రధానంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, జూనియర్ అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, అటెండర్లు తదితర పోస్టులు తూతూమంత్రంగానే భర్తీ అయ్యాయి. పాలన నిర్వహణ కోసం బోధనేతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకునేందుకు అనుమతులు వచ్చినా, ఆ పోస్టులను భర్తీ చేయడంలో వర్సిటీ యంత్రాంగం జాప్యం చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పోస్టుల భర్తీపై దృష్టి సారిస్తుందా? లేక షరా మామూలుగానే విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేస్తారా? అన్నది వేచి చూడాలి.
Read Also: ఏసీబీకి చిక్కిన కొల్లూరు ఎస్ఐ
Follow Us On: X(Twitter)


