కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ మహాత్మాగాంధీ స్మారక వైద్యశాఖ (MGM Hospital)లో అనాథ శవాల నిర్వహణలో పోలీసుల నిర్లక్ష్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుర్తు తెలియని మృతదేహాలు రెండు నెలలకు పైగా ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలోనే ఉండిపోవడం, పోస్టుమార్టం కూడా సకాలంలో నిర్వహించకపోవడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది. సాధారణంగా గుర్తు తెలియని మృతదేహం లభించిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, మృతుడి వివరాల కోసం గాలింపు చేపట్టాలి.
నెలల పాటు మార్చురీలోనే..
అనంతరం పోస్టుమార్టం నిర్వహించి, చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో లభించిన అనాధ శవాలు రెండు నెలల పాటు మార్చురీలోనే ఉండిపోవడం అధికార యంత్రాంగం పనితీరుపై సందేహాలు రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంపై కేఎంసీ ఫోరెన్సిక్ విభాగం అధికారులు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఫిర్యాదుపై స్పందించిన సీపీ సంబంధిత అధికారులను మందలించడంతో పోలీసులు వెంటనే కదిలారు.
2 రోజుల వ్యవధిలో 6 ఎఫ్ఐఆర్లు
కేఎంసీ ఫోరెన్సిక్ అధికారుల ఫిర్యాదుతో సీపీ స్పందించారు. వెంటనే ఆమె సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు అలర్ట్ అయిన మట్వాడ పోలీసులు రెండు రోజుల వ్యవధిలోనే ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి పెండింగ్‌లో ఉన్న కేసుల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డబ్బులు ఉంటేనే పోస్టుమార్టం త్వరగా జరుగుతుంది. అనాథ శవాలకు ఎవరూ లేకపోవడంతో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పోలీసుల నిర్లక్ష్యమే కారణమా?
అనాథ శవాల విషయంలో నిజంగానే పోలీసుల నిర్లక్ష్యమే కారణమా? పోస్టుమార్టం రెండు నెలలు ఆలస్యం కావడానికి బాధ్యత ఎవరిది? సీపీ జోక్యం చేసుకున్న తర్వాతే ఎందుకు కేసులు కదిలాయి? రెండు నెలల పాటు సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ నిర్లక్ష్యానికి బాధ్యులైన పోలీసు, ఇతర శాఖల అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అనాథ అయినా, గుర్తు తెలియని వ్యక్తి అయినా ప్రతి మృతదేహానికి చట్టం ముందు సమాన గౌరవం, న్యాయం దక్కాల్సిందే. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

