సీఎం పర్యటన వేళ.. సీక్రెట్ ఫామ్ హౌస్ ప్లాన్!

కలం, తెలంగాణ బ్యూరో : దాదాపు ఏడాది క్రితం.. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్లో పలువురు కాంగ్రెస్ (Telangana Congress) ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమైనట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. కేబినెట్‌లోని ఓ మంత్రి తమ నియోజకవర్గాలపై వివక్ష చూపుతున్నారని, ఆయన తీరును ఎండగట్టాలని ఈ భేటీలో చర్చించినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిణామం నాడు రాష్ట్ర ప్రభుత్వంలో తీవ్ర కలకలం రేపింది. ఆ తర్వాత సద్దుమణిగింది!

కానీ, ఇప్పుడు మరో ఎమ్మెల్యే అదే తరహా ఫామ్ హౌస్ భేటీకి సన్నాహాలు చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ పెద్దలకు సమాచారం అందింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఈ సమావేశం నిర్వహించాలనుకున్నట్లు, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ చేరింది. ఈ మీటింగ్‌కు ఎవరెవరు హాజరయ్యే అవకాశాలున్నాయో పసిగట్టే పనిని కాంగ్రెస్ పెద్దలు మొదలుపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే ఈ సమావేశం జరిపేలా పలువురు ఎమ్మెల్యేలకు సదరు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఆ మెసేజ్ అందుకున్నవారిలో ఒకరి ద్వారానే కాంగ్రెస్ పెద్దలకు భేటీ విషయం చేరినట్లు సమాచారం.

దీంతో ఆ సమావేశం అవసరం ఏంటి?.. ఏ ఉద్దేశం కోసం నిర్వహిస్తున్నారు?.. ఎవరెవరిని తన వర్గంగా భావిస్తున్నారు?.. ఈ మీటింగ్ ద్వారా ఏం మెసేజ్ పంపాలని ఆలోచిస్తున్నారు?.. ఇలాంటివన్నీ కాంగ్రెస్ పెద్దలు ఆరా తీశారు. ఈ సమావేశానికి హాజరైనవారి నుంచే లోపల జరిగిన చర్చల వివరాలను తెప్పించుకునేలా కౌంటర్ స్ట్రాటజీని రూపొందిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో మరో ఫామ్ హౌస్ భేటీ అంశం ఇప్పుడు కలకలం రేపుతున్నది. త్వరలోనే ఓ కీలక ఎమ్మెల్యే ఈ సమావేశం నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు పార్టీ పెద్దలకు సమాచారం చేరింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, తన అనుకూల వర్గాన్ని తయారుచేసుకునేలా సదరు ఎమ్మెల్యే ఆలోచిస్తున్నట్లు పెద్దలకు తెలిసింది. దీంతో సమావేశంపై, అందులో పాల్గొనేవారిపై ఇప్పటి నుంచి ఆరా తీయడం మొదలుపెట్టారు.

పది రోజుల్లోనే..!

ఎలాగూ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంలోనే ఈ ఫామ్ హౌస్ భేటీ జరిపేలా ముందస్తు సన్నాహాలు చేసుకోవడంతో ఈ పది రోజుల్లో ఎప్పుడు జరుగుతుందనే అంశంపై పార్టీ పెద్దల్లో ఆసక్తి నెలకొన్నది. ఈ భేటీ కేవలం పార్టీ, ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి చేయడానికి ఎంచుకున్న ‘ప్రెషర్’ ఎత్తుగడా?.. లేక ఆశించిన పదవులు రాలేదనే ఫ్రస్ట్రేషన్‌తోనా?.. లేక వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ఒక వర్గాన్ని తయారు చేసుకునే ముందస్తు ప్రణాళికా?.. ఇలాంటి అంశాల నుంచి నిఘా మొదలైంది.

ముల్లును ముల్లుతోనే తీయాలన్న తరహాలో ఆ ఫామ్ హౌస్ భేటీకి హాజరైనవారి నుంచే పూర్తి వివరాలను రాబట్టేలా ఒకరిద్దరిని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేని సమయంలో నిర్వహించడం వెనక ఉద్దేశం తేటతెల్లమవుతున్నందున పార్టీ సైతం సీరియస్ దృష్టి పెట్టాలని భావిస్తున్నది. కాంగ్రెస్‌లో ఉంటూనే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక గ్రూపును, వర్గాన్ని తయారుచేయాలన్న ఆలోచనే పార్టీ క్రమశిక్షణా రాహిత్యమన్నది రాష్ట్ర పార్టీ పెద్దల వాదన.

పదవి దక్కలేదనే ఈ నిర్ణయమా?

ఆశించిన స్థాయిలో పదవి రాలేదని, గతంలో హామీ ఇచ్చినా ఇప్పుడు పట్టించుకోలేదన్న అభిప్రాయంతోనే పోటీగా ఒక బలమైన వర్గాన్ని తయారుచేసుకోవాలని సదరు ఎమ్మెల్యే భావిస్తున్నట్లు పార్టీ పెద్దలు అంచనాకు వచ్చారు. ఇటీవల పలు రకాల విమర్శలు చేస్తూ పార్టీ నాయకత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను ఆ ఎమ్మెల్యే తప్పుపడుతున్న పరిస్థితులను బేరీజు వేసుకున్నారు. నాయకత్వమే ఒత్తిడికి లోనయ్యేలా శక్తిని నిరూపించుకునేలా, ఒక వర్గం తనకు మద్దతు ఇస్తున్నదనే మెసేజ్ పంపడమే లక్ష్యంగా ఈ భేటీకి ప్లాన్ చేస్తున్నట్లు పెద్దలు గ్రహించారు.

ఎప్పటికప్పుడు భేటీకి సంబంధించిన వివరాలను కాంగ్రెస్ పెద్దలు సేకరిస్తున్నారు. కదలికలపై కన్ను వేశారు. ఆ భేటీ ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారకుండా ఉండేందుకు ముందుగానే సమాచారాన్ని సేకరించుకునేలా ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేసుకునేలా కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఫామ్ హౌస్ భేటీ వివరాలను తెలుసుకుని దానికి తగిన ప్రణాళికను భవిష్యత్తు పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసేలా యోచిస్తున్నారు.

జరుగుతుందా?.. వాయిదానా?

సీఎం విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఫామ్ హౌస్ సమావేశం నిర్వహించాలనుకున్న సదరు ఎమ్మెల్యే ప్రణాళిక యథావిధిగా అమలవుతుందా?.. లేక ముందుగానే లీక్ అయిందనే అనుమానంతో వాయిదా పడుతుందా?.. అనేది ఆసక్తికరంగా మారింది. సమావేశం జరిగినా, జరగకపోయినా పార్టీ, ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆ అంశాన్ని సీరియస్‌గానే పరిగణిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది ఎలాంటి మలుపు తీసుకుంటున్నదని కూడా చర్చనీయాంశంగా మారింది.

గతంలో ఫామ్ హౌస్ మీటింగ్‌పై పార్టీలో జరిగిన చర్చ, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్ మీటింగ్ ఎలా ఉంటుందన్నది కీలకంగా మారింది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకునే సమయానికి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>