కలం, కరీంనగర్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం (Medipalli Satyam) పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ చిత్రమిశ్రాను కలిసి రైతాంగ సమస్యలపై చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో బిఆర్ఎస్ పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో రైతులు విసిగిపోయారని అన్నారు. ఒక సంచికి నాలుగు కిలోలు అదనంగా తూకం వేసి రైతులను నట్టేట ముంచిన ఉదంతాలు అనేకం చూశామని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తప్ప-తాలుతో సంబంధం లేకుండా, కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయం ప్రతి రైతన్నకు తెలుసు అని చెప్పారు. దురదృష్టవశాత్తు ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీపీఎస్ విధానం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాలేకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతుల నుండి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తప్ప-తాలుతో సంబంధం లేకుండా కోత లేకుండా ధాన్యాన్ని కొనాలని కలెక్టర్ ని కోరడం జరిగిందన్నారు. ధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు లారీల సంఖ్య పెంచాలని, ప్రతి మండల స్థాయి కొనుగోలు కేంద్రం వద్ద, రైస్ మిల్లు వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, ప్రతిరోజు సమీక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని, డాష్ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. “ఇది రైతు పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వం. గడిచిన రెండు సంవత్సరాలలో రూ.1,60,000 కోట్ల బడ్జెట్‌ను రైతు సంక్షేమం కోసం సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఖర్చుపెట్టింది.. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమం కోసం రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదు. గతంలో ప్రతిపక్ష హోదాలో రైతులకు అన్యాయం జరిగినప్పుడు పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రైతన్న సమస్యల గురించి కలెక్టర్ కు వివరించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. కలెక్టర్ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు.. నిరంతరం సమీక్షిస్తున్నారు” అని తెలిపారు.
అధికారులు, ప్రభుత్వం బాగా పనిచేసినప్పటికీ రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. “అలా ఇబ్బందులు పెట్టిన చోట నేను స్వయంగా వెళ్లి రైతు సోదరులతో కలిసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ 43 కిలోల తూకాన్ని అంగీకరించబోం” అని హెచ్చరించారు. మరో గంటలో రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారని, దాని తర్వాత మిల్లర్లల ప్రవర్తనలో మార్పు రాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుని వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు ఉప్పుల అంజన్ ప్రసాద్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్, సీనియర్ నాయకులు కోల రమేష్, రామడుగు మండల కాంగ్రెస్ అధ్యక్షులు జవ్వాజి హరీష్, తదితరులు ఉన్నారు.

